`కేజీఎఫ్‌` చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమకి కొత్త ఊపుతీసుకొచ్చిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. రీమేక్‌ సినిమాలకు కేరాఫ్‌ అనే కన్నడ చిత్ర పరిశ్రమపై ఉన్న మచ్చని పటాపంచలు చేస్తూ దేశ వ్యాప్తంగా శాండల్‌వుడ్‌ సత్తా ఏంటో చాటారు. ప్రస్తుతం `కేజీఎఫ్‌ఃఛాప్టర్‌ 2` తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌ నీల్‌. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రొడక్షన్‌ నుంచి మరో జాతీయ స్థాయి సినిమా రాబోతుంది. 

డిసెంబర్‌ 2న మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు మరో ఇండియన్‌ సినిమాని ప్రకటించబోతున్నట్టు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. అయితే దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తారని, ప్రభాస్ హీరోగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ వాటికి బ్రేక్‌ చెబుతూ, ప్రభాస్‌ వరుసగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ ఓ సినిమా, అలాగే బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రాలు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఇవి ప్రారంభం కానున్నాయి.

మరి ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌తో సినిమా రావడానికి మరో రెండేళ్ళు పడుతుందనే టాక్‌ వినిపించింది. అయితే తాజాగా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించబోయే సినిమా ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ ల కాంబినేషన్‌లోనే ఉంటుందా? లేక మరో కొత్త కాంబినేషన్‌లో సినిమాని ప్రకటిస్తారా? అన్నది ఆసక్తి నెలకొంది. కానీ వీరి కాంబినేషన్‌లోనే సినిమా ప్రకటన ఉండబోతుందనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ ఓ సినిమా అనుకున్న విషయం తెలిసిందే. మరి దీనికి సంబంధించిన ప్రకటన వెలువరించనున్నారా? అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. మరి దీని విషయంలో క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు వెయింట్‌ చేయాల్సిందే.