బ్రూస్‌ విల్లీస్‌ అఫేసియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. మాట్లాడటంలో ఇబ్బంది తలెత్తడం ఈ వ్యాధి లక్షణాలుగా తెలుస్తుంది. తన రిటైర్‌మెంట్‌తో బ్రూస్‌ విల్లీస్‌ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. 

ప్రముఖ హాలీవుడ్‌ దిగ్గజ నటుడు బ్రూస్‌ విల్లీస్‌ అభిమానులకు దిగ్భ్రాంతికి గురి చేసే వార్తని వెల్లడించారు. ఫ్యాన్స్ కి పెద్ద షాకిస్తూ తన సినిమా కెరీర్‌కి గుడ్‌బై చెప్పారు. ఆయన అరుదై వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో తాను సినిమాలు చేయబోనని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. బ్రూస్‌ విల్లీస్‌ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల కారణంగా ఆయన్ని సినిమాలకు దూరంగా ఉంచాలని భావించారు. దీంతో తన రిటైర్‌మెంట్‌ని ప్రకటిస్తూ ఓ ఎమోషన్‌ నోట్‌ని పంచుకున్నారు. బ్రూస్‌ విల్లీస్‌ అఫేసియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. మాట్లాడటంలో ఇబ్బంది తలెత్తడం ఈ వ్యాధి లక్షణాలుగా తెలుస్తుంది. 

తన రిటైర్‌మెంట్‌తో బ్రూస్‌ విల్లీస్‌ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఉన్నట్టుంది సినిమాలకు గుడ్‌బై చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. ఆయనకు సోకిన వ్యాధి గురించి తెలుసుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన్ని సినిమాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. దీంతో బ్రూస్‌ ఇక సినిమాల్లో నటించలేరనే వార్తని వెల్లడిస్తూ ఎమోషనల్‌ అయ్యారు. 

`బ్రూస్ విల్లీస్‌ని ఎంతగానో అభిమానించే అభిమానులకు, సన్నిహితులు, స్నేహితులకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకొంటున్నాం. ఆయన ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల అరుదైన అఫేసియా అనే వ్యాధికి గురయ్యారని వైద్యులు చెప్పారు. అందుకే అతడు నటనకు స్వస్తి చెప్పాలని భావించారు. బ్రూస్ విల్లీస్ తన నటనకు స్వస్తి చెప్పాలని తీసుకొన్న నిర్ణయం చాలా కఠినమైనది. అంతేకాకుండా బాధకరమైనది. 

అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేని విషయం. ఎన్నో ఏళ్లుగా భేషరతుగా ప్రేమను కురిపించారు, విడదీయలేని అనుబంధాన్ని పెంచుకొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాన్ని తీసుకొన్నాం. మనమంత ఒక్కటిగానే ఉండి బ్రూస్ విల్లీస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. బ్రూస్ ఎప్పుడూ పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకొంటారు. ఆయన విజన్‌ను మనం కొనసాగిద్దాం` అని కుటుంబ సభ్యులు ఎమ్మా, డెమీ, రుమర్, స్కౌట్, తల్లులా, మాబెల్, ఎవెలీన్ ఈ నోట్‌లో వెల్లడించారు. 

మరి బ్రూస్‌ని వెంటాడుతున్న `అఫేసియా ` వ్యాధి గురించి తెలుసుకుంటే. భాషపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. సరిగ్గా మాట్లాడలేరు. బ్రెయిన్‌లోని ఒక ప్రదేశానికి గాయం కావడంగానీ, ఏదైనా ఇతర సమస్య రావడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో వారు భాషను ఉచ్చరించడానికిగానీ, అవగాహన చేసుకొనే పరిస్థితి ఉండదు. ఎదుటి మనిషితో సరైన రీతిలో మాట్లాడటానికి అవకాశం ఉండదు. తమ భావాలను ఎదుటి వారితో పంచుకోలేకపోతుంటారు. ప్రస్తుతం బ్రూస్‌ ఇదే సమస్యని ఎదుర్కొంటున్నారు.

ఇక బ్రూస్ విల్లీస్ సినిమా కెరీర్‌ చూస్తే, స్టేజ్‌ నాటకాల నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది. 1970లో ఆఫ్ బ్రాడ్‌వే అనే వేదికపై యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు. 1985లో `మూన్‌లైటింగ్` అనే కామెడీ డ్రామా సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. `డై హార్డ్` అనే చిత్రంతో హాలీవుడ్‌లో పాగా వేశాడు. బిగ్‌ బ్రేక్‌ అందుకున్నారు. ఇక అప్పట్నుంచి వెనుతిరిగి చూసుకునే అవసరం రాలేదు. రొమాంటిక్‌ కామెడీలు, యాక్షన్‌ మూవీస్‌ ఇలా అన్ని రకాల జోనర్‌ సినిమాలు చేసి మెప్పించారు. `ది లాస్ట్ బాయ్ స్కౌట్`, `పల్ప్ ఫిక్షన్`, `12 మంకీస్`, `లాస్ట్ మ్యాన్ స్టాండింగ్`, `ఫిఫ్త్ ఎలిమెంట్`, `అర్మగేడ్డాన్`, `ది సిక్త్స్ సెన్స్`, `హార్ట్స్ వార్`, `టియర్ ఆఫ్ ది సన్` చిత్రాల్లో నటించారు.చివరగా ఆయన 2019లో `మదర్‌లెస్ బ్రూక్లీన్` అనే చిత్రంలో మెరిశారు. ప్రస్తుతం ఆయన నటించిన ఎనిమిది సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉంది.