యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాని చాటింది. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ కలెక్షన్ల పరంగా రికార్డులు తిరగరాయడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు బాహుబలి చిత్రం గురించి మాట్లాడారు. 

తాజాగా ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్కాట్ డెరిక్సన్ బాహుబలి చిత్రం గురించి ట్వీట్ చేశాడు. ఓ ఓ నెటిజన్ బాహుబలి చిత్ర వీడియోని షేర్ చేయగా దానిని డెరిక్సన్ ట్వీట్ చేశాడు. బాహుబలి 2లో క్లైమాక్స్ లో ప్రభాస్ మాహిష్మతి కోటలోకి ప్రవేశించే సీన్ హైలైట్. ప్రభాస్, సత్యరాజ్, మరికొందరు సైనికులు కలసి తాటి చెట్టుపై నుంచి కోటలోకి దూకుతారు. 

ఇలాంటి అద్భుతమైన సన్నివేశాన్ని తానింతవరకు చూడలేదు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీని గురించి స్కాట్ డెరిక్సన్ ట్వీట్ చేస్తూ.. ఇది ఊపిరి బిగబట్టుకునే సన్నివేశం.. ఇండియన్ బాహుబలి అని కామెంట్ చేశాడు. 

హాలీవుడ్ లో ఘనవిజయాన్ని అందుకున్న 'డాక్టర్ స్ట్రేంజ్' చిత్రానికి ఇతడే దర్శకుడు. ఈ సిరీస్ లో కొనసాగింపుగా స్కాట్ డెరిక్సన్ దర్శకత్వంలో మరో చిత్రం రానుంది.