‘కమాండో’,‘ప్రిడేటర్’,‘ఎక్స్ మెన్: ది లాస్ట్ స్టాండ్’ లాంటి సినిమాలతో పాపులర్ అయిన  హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్. ఆయన ప్రిన్స్  మహేష్ బాబుతో  ఒక స్పై మూవీ చేయాలని, అందులో తాను నటించాలని కోరుకోరుతూ ట్వీట్ చేయటం సెన్సేషన్ గా మారింది. మహేష్ గురించి ఆయనకి ఎవరు చెప్పారో...ఏం తెలుసుకున్నాడో ఏమో కానీ.. మన సూపర్ స్టార్‌ను ట్యాగ్ చేస్తూ అతను రెండు ఆసక్తికర ట్వీట్లు చేసి, తెలుగు సిని వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసారు.

ఈ హాలీవుడ్‌ స్టార్‌ బిల్‌ డ్యూక్‌  మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి, తమిళ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌లను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. అన్నీ కుదిరితే ఓ ఇంటర్నేషనల్  స్పై సినిమా తీద్దామంటూ వారిని లంచ్‌కు ఆహ్వానించారు. అంతేకాదు మహిళల అక్షరాస్యత అభివృద్ధి విషయంలో అంతర్జాతీయ కార్యక్రమాల ఏర్పాటు గురించి చర్చిద్దామని ఐశ్వర్య ధనుష్‌కు బిల్‌ చెప్పారు.  ఐశ్వర్యను 2016లో యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.

‘వంశీ పైడిపల్లి, మహేశ్‌బాబు మీరు లాస్‌ ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు డీటీఎల్‌ఏ (డౌన్‌టౌన్‌ లాస్‌ఏంజెల్స్‌)లో దిగి, భోజనానికి రండి. ఇంటర్నేషనల్‌ స్పై సినిమా గురించి చర్చించుకుందాం’ అని బిల్‌ ట్వీట్ చేశారు. ఇదే విధంగా మరో ట్వీట్‌లో ఎ.ఆర్‌.మురుగదాస్‌, మహేశ్‌బాబులను చర్చలకు ఆహ్వానించారు. ఓ హాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ను ఆహ్వానించడంతో అభిమానులు సంబరపడుతున్నారు.

ఒక ప్రముఖ హాలీవుడ్ నటుడు మన హీరో, దర్శకుల్ని ఇలా ట్యాగ్ చేసి ఇంటర్నేషనల్ స్పై మూవీ గురించి మాట్లాడటం గొప్ప విషయమే. మరి మహేష్, వంశీ, మురుగదాస్ ఈ ట్వీట్ల విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.