వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'వాల్మీకి' సినిమా శుక్రవారం రిలీజ్ ఉందనగా.. గురువారం రాత్రి నాడు సడెన్ గా టైటిల్ మార్చారు. దానికి కారణం బోయ సామజిక వర్గ ప్రజల నుండి ఈ సినిమాకి తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడమే.. కర్నూలు, అనంతపురం రెండు జిల్లాలో బోయ సామజిక వర్గ ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.

సినిమా గనుక ఈ రెండు జిల్లాలో విడుదలైతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనే సమాచారంతో రెండు జిల్లాల కలెక్టర్లు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ రెండు జిల్లాల ఎస్పీలు చిత్ర విడుదలని నిలిపివేస్తూ థియేటర్స్ యాజమాన్యాలకు ఆదేశాలు పంపారు. ఆదేశాల్ని ధిక్కరించి చిత్ర ప్రదర్శన చేస్తే కఠినచర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

కలెక్టర్ల ఆదేశాలనుసవాల్‌ చేస్తూ 14 రీల్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేయగా గురువారం రాత్రి న్యాయమూర్తి జి.శ్యాంప్రసాద్‌ ముందు విచారణ జరిగింది. కలెక్టర్లు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రెండు వారాలపాటు సస్పెండ్‌ చేసింది.  

తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘జిగర్తాండ’ సినిమాకు ‘గద్దలకొండ గణేశ్’ రీమేక్‌గా వచ్చింది. వరుణ్ తేజ్‌, పూజా హెగ్డే జంటగా నటించారు. తమిళ నటుడు అథర్వా మురళి కీలక పాత్రను పోషించారు. తొలిరోజు ఈ సినిమా హిట్ టాక్ దక్కించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.7 కోట్లను వసూలు చేసింది.