కన్నడలో లోకల్ హీరోలకంటే తమిళ్ తెలుగు హీరోల డామినేషన్ ఈ మధ్య ఎక్కువయ్యింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు వస్తున్నాయంటే చాలు కన్నడ సినిమాలు కనిపించకుండా పోతున్నాయి. కన్నడ ప్రేక్షకులు కూడా మన హీరోల యాక్షన్ అండ్ ఎమోషన్ కు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే చాలా కాలం తరువాత ఒక కన్నడ హీరో అన్ని ఇండస్ట్రీలను ఆకర్షిస్తున్నాడు. 

యష్ నటించిన KGF ట్రైలర్ కన్నడతో పాటు మలయాళం - తమిళ్ అలాగే తెలుగు - హిందీలో కూడా మంచి ఆదరణను దక్కించుకుంది. అందరిని ఆకర్షించడంతో సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా మొదటిసారి ఒక కన్నడ హీరో సినిమా 2000+ పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 21న రిలీజ్ కానున్న ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోలు కొన్ని దేశాల్లో ఒకరోజు ముందుగానే ప్రదర్శించబడనున్నాయి. 

పైగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ తో యాష్ చేసిన హంగామా బాగానే క్లిక్ అయ్యింది. రాజమౌళి చిత్ర యూనిట్ ని ప్రశంసించడంతో పాటు యష్ స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాలో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. దీంతో KGF సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఇక తెలుగులో సినిమాను సాయి కొర్రపాటి భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.