కింగ్‌ నాగార్జునకి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. బిగ్‌ బాస్‌ షోకి సంబంధించిన ఏపీ హైకోర్ట్ నాగ్‌కి బుధవారం నోటీసులు జారీ చేసింది. 

కింగ్‌ నాగార్జునకి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. బిగ్‌ బాస్‌ షోకి సంబంధించిన ఏపీ హైకోర్ట్ నాగ్‌కి బుధవారం నోటీసులు జారీ చేసింది. బిగ్ బాస్‌ షోని నిలిపివేయాలంటూ పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో హైకోర్ట్ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, అలాగే `స్టార్ మా`తోపాటు నాగార్జునకి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని వెల్లడించింది. 

ఈ కేసుకి సంబంధించిన తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు ప్రభుత్వం, స్టార్‌ మా నిర్వహకుల నుంచి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. గతంలోనూ బిగ్‌ బాస్‌పై ఇలాంటి పిటిషన్‌లు దాఖలయ్యాయి. కానీ షోని మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. గత ఆరు సీజన్లు విజయవంతంగా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. 

త్వరలోనే ఏడో సీజన్‌ కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. మరోవైపు ఈ ఆదివారం `స్టార్‌ మా`లో బిగ్‌ బాస్‌ షోకి సంబంధించి ఓ ప్రత్యేకమైన ఈవెంట్‌ని కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో గతంలో షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరు ఇందులో పాల్గొనబోతున్నారు. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. సెప్టెంబర్‌లో ఏడో సీజన్‌ బిగ్‌ బాస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు షోని ఆపాలంటూ పిటిషన్‌ దాఖలు కావడం బిగ్‌ బాస్‌ ప్రియులను ఆశ్చర్యపరుస్తుంది.