పవన్‌ కళ్యాణ్‌, దగ్గుబాటి రానా కలిసి `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్ర రీమేక్‌లో నటిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆ మధ్య ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 20 నుంచి ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో పవన్‌, రానా ఒకరిపై ఒకరు గొడవ పడబోతున్నారు. దీంతో ఈ సినిమాపై ఆద్యంతం ఆసక్తి నెలకొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఇద్దరు పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఐశ్వర్యా రాజేష్‌, సాయిపల్లవిని అనుకుంటున్నారట. సాయిపల్లవి ప్రస్తుతం రానాతో `విరాటపర్వం`లో నటిస్తుంది. దీంతో ఇదే కాంబినేషన్‌ని రిపీట్‌ చేయాలని భావిస్తున్నారట. మరోవైపు పవన్‌తో ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తారని సమాచారం. 

ఇక మలయాళంలో బిజూ మీనన్‌, పృథ్వీరాజ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్ర రీమేక్‌లో బిజూ మీనన్‌ పాత్రలో పవన్‌ కళ్యాణ్‌, పృథ్వీరాజ్‌ పాత్రలో రానా నటించనున్నారు. ఈ సినిమా కోసం పవన్‌ నలభై రోజుల డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. దీన్ని త్వరగా పూర్తి చేసి హరీష్‌ శంకర్‌ సినిమాని స్టార్ట్ చేయనున్నారట. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని అల్లూమినియం ఫ్యాక్టరీలో ఓ పెద్ద సెట్‌ వేశారు. ఇందులోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందట. మరోవైపు ఈ సినిమాకి `బిల్లా రంగా` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.