హీరోయిన్ ప్రణీత సుభాస్ తల్లి అయ్యింది. ఆమె శుక్రవారం పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా చిన్నారితో దిగిన ఫోటోని పంచుకుంటూ, ఎమోషనల్ నోట్‌ని షేర్ చేసింది.
హీరోయిన్ ప్రణీత సుభాస్ తల్లి అయ్యింది. ఆమె పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. శుక్రవారం ఆమె కూతురికి జన్మనిచ్చినట్టు పేర్కొంది. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రణీత సుభాష్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా తన చిన్నారి కూతురిని పొత్తిళ్లలోకి తీసుకుని తల్లితనాన్ని అనుభవిస్తూ దిగిన ఫోటోని అభిమానులతో పంచుకుంది ప్రణీత. ఇందులో ఆమె భావోద్వేగభరిత్తమైన, గర్వంతో కూడిన నోట్‌ని షేర్ చేసింది.
ఈ పోస్ట్ లో ప్రణీత సుభాష్ చెబుతూ, `పాప పుట్టినప్పట్నుంచి అంతా కలగా అనిపిస్తుంది. నాకు గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండటం నిజంగా నా అదృష్టం. కానీ మానసికంగా మాత్రం ఆమెకి ఇది చాలా కష్టకాలం. డాక్టర్ సునీల్ ఈశ్వర్, అతడి టీమ్ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్ సుబ్బు, అతడి టీమ్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విషయం మీకు చెప్పకుండా ఉండలేకపోయాను` అని పేర్కొంది ప్రణీత. ఈ సందర్భంగా వైద్యులతో దిగిన మరోఫోటోని కూడా పంచుకుంది. అయితే ఇందులో తన పాప ముఖం కనిపించకుండా జగ్రత్త తీసుకోవడం విశేషం.
మాతృత్వ మధురిమలతో ఉప్పొంగిపోతున్న ప్రణీతకి అభిమానులు, సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహాలక్ష్మి ఇంటికొచ్చిందంటూ ప్రశంసిస్తున్నారు. ప్రణీత గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తల్లి కాబోతున్న విషయాన్ని సైతం సోషల్ మీడియా ద్వారానే ప్రకటించింది. స్కానింగ్ కాపీని షేర్ చేసి గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. వరుసగా బేబీ బంప్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంది. తల్లి కాబోతున్నామనే ఆనంద క్షణాలను పంచుకుంటూ తెగ మురిసిపోయింది ప్రణీత. అలాగే సీమంతం ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఏకంగా పండంటి కూతురికి జన్మనివ్వడం విశేషం.
