డింపుల్ హయాతీ లేటెస్ట్ మూవీ రామబాణం. ఈ చిత్ర విడుదల సందర్భంగా ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.  

హైదరాబాద్ బ్యూటీ డింపుల్ హయాతీకి సాలిడ్ బ్రేక్ కావాలి. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న డింపుల్ ని వరుస పరాజయాలు ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో మేకర్స్ ఆసక్తి చూపడం లేదు. ఖిలాడి మూవీతో మంచి ఆఫర్ పట్టేసిందనుకుంటే... ఆ మూవీ ప్లాప్ అయ్యింది. ఖిలాడి విజయం సాధిస్తే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ రామబాణం చిత్రం మీద పెట్టుకున్నారు. గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన రామబాణం మూవీ మే 5న విడుదలవుతుంది. 

చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న డింపుల్ హయాతీ తన కెరీర్ ని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే దర్శకుడు శ్రీవాస్ రెండు ఆడిషన్స్ చేశాకే నమ్మి ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు. రామబాణం మూవీ నేను యూట్యూబ్ బ్లాగర్ భైరవి రోల్ చేశాను. సోషల్ మీడియా మీద నాకు పెద్దగా అవగాహన లేదు. అందుకే భైరవి పాత్ర ఛాలెంజింగ్ అనిపించింది. 

ఖిలాడి మూవీలో నేను గ్లామరస్ రోల్ చేశాను. ఆ సినిమా చూసి నేను భైరవి పాత్రకు సెట్ కానేమో అని దర్శకుడు శ్రీవాస్ సందేహం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఆడిషన్ చేసిన తర్వాత నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చారని... ఆమె చెప్పుకొచ్చారు. ఇక పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఇంకా బేబీ స్టెప్స్ వేస్తున్నానంటూ... డింపుల్ హయాతీ చెప్పుకొచ్చారు. 2017లో విడుదలైన గల్ఫ్ మూవీతో డింపుల్ హీరోయిన్ అయ్యారు. అనంతరం అభినేత్రి 2, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో నటించారు.