సారాంశం
స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి భర్తతో విడిపోయారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈ ప్రశ్నకు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
కలర్స్ పేరుతో మా టీవీలో ప్రసారమైన షోతో స్వాతి పాపులర్ అయ్యారు. టీనేజ్ లోనే బుల్లితెరను దున్నేసింది అమ్మడు. విపరీతంగా అభిమానులను సంపాదించింది. స్వాతి సెన్సాఫ్ హ్యూమర్, ఎనర్జీ, గలగలా మాట్లాడే తత్త్వం ఆమెను స్టార్ చేశాయి. అలా వచ్చిన ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేసింది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్ చిత్రంతో వెండితెరపై మొదటిసారి కనిపించింది.
అనంతరం సోలో హీరోయిన్ గా కూడా చేసి సక్సెస్ అయ్యింది. 2018లో ప్రియుడు వికాస్ వాసును పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. అతడు వృత్తి రీత్యా పైలట్. అదే సమయంలో సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. కొన్నాళ్ల క్రితం ఇండియాకు వచ్చేసిన స్వాతి ఇక్కడే ఉంటున్నారు. కమ్ బ్యాక్ ఇస్తూ పంచతంత్రం టైటిల్ తో ఓ చిత్రం చేసింది. పంచతంత్రం గత ఏడాది విడుదలైంది.
తాజాగా ఆమె మంత్ ఆఫ్ మధు టైటిల్ తో ఎమోషనల్ డ్రామా చేశారు. నవీన్ చంద్ర హీరో. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న స్వాతిని విడాకులపై స్పష్టత ఇవ్వాలని మీడియా కోరింది. స్వాతి ఆ విషయం మీద స్పందించను అన్నారు. క్లారిటీ ఇవ్వకపోవడమే క్లారిటీ అన్నారు. అది సంబంధం లేని ప్రశ్న. నేను మాట్లాడను అన్నారు. స్వాతి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక మంత్ ఆఫ్ మధు త్వరలో విడుదల కానుంది. చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంది. శ్రీకాంత్ నాగోతి ఈ చిత్ర దర్శకుడు. యశ్వంత్ నిర్మిస్తున్నాడు. కమ్ బ్యాక్ అనంతరం బ్రేక్ కోసం స్వాతిగా గట్టిగా ట్రై చేస్తుంది. ఈమెకు తమిళంలో కూడా మార్కెట్ ఉంది.