టాలీవుడ్లో ఢిల్లీ భామ రాశి ఖన్నా జోరు తగ్గింది. 2020లో విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తరువాత ఆమె మరో కొత్త చిత్రానికి సైన్ చేయలేదు. 2019లో ప్రతిరోజూ పండగే, వెంకీ మామ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఆమె, అనూహ్యంగా టాలీవుడ్ లో వెనుక బడ్డారు. అయితే తమిళంలో ఆమె బిజీ అయ్యారు. నాలుగు తమిళ చిత్రాలతో పాటు, ఓ మలయాళ చిత్రంలో రాశి ఖన్నా నటిస్తున్నారు. 

వాటిలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న తుగ్లక్ దర్బార్ ఒకటి. గతంలో ఓ చిత్రంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా జంటగా నటించగా, ఇది రెండవ చిత్రం. తెలుగులో అవకాశాలు లేకపోయినా ఆమె మిగతా పరిశ్రమలలో బిజీగా ఉన్నారు. కాగా రాశి ఖన్నా బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. అదేదో పాత్ర కోసం అనుకుంటే పొరపాటే. శారీరక, మానసిక దృఢత్వం కోసం ఆమె ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నారట. రాశి ఖన్నా రెడ్ గ్లోవ్స్ ధరించి పంచెస్ విసురుతున్న వీడియో పంచుకోగా, వైరల్ అవుతుంది. 

తాను తీసుకుంటున్న బాక్సింగ్ శిక్షణ గురించి రాశి ఖన్నా స్వయంగా మాట్లాడారు... ‘‘శరీర శక్తిని పెంచుకోవడానికి బాక్సింగ్ గొప్ప మార్గం‌. అందులోనూ నేను తీసుకుంటున్నది ‘హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌’. రోజూ గంటసేపు నేర్చుకుంటున్నా. కొవ్వు, పిండి పదార్థాల సమాహారంతో నా డైట్‌ ఉంటుంది. బాక్సింగ్‌ అనేది శారీరక బలం మాత్రమే కాదు.. మానసిక బలాన్నీ పెంపొందిస్తుంది. ఎంత పెద్ద సవాల్‌ని అయినా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం నాలో పెరిగింది. అందరికీ మానసిక బలం అవసరం. బలహీనత అనేది మనల్ని హరించివేస్తుంది’’ అన్నారు. రాశి ఖన్నా వీడియో మరియు కామెంట్స్ వైరల్ గా మారాయి.