సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. వారు చేసే పనులు కూడా మంచితో కూడుకొని ఉండాలి. చెడు అలవాట్లను, పనులను ప్రోత్సహించే విధంగా ఉండకూడదు. కారణం సెలెబ్రిటీలను అభిమానించే వారు సులభంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సినిమాలో పాత్ర డిమాండ్ వలన హీరో లేదా హీరోయిన్ మద్యపానం, ధూమపానం చేసినా కానీ ఆరోగ్యానికి హానికరం అని తెరపై వేస్తారు. 

ఐతే కొందరు తారలు ఈ మధ్య ఆరోగ్యానికి హానికరమైన మద్యపానం వంటి మత్తు పానీయాల ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికంగా దక్కే డబ్బుల కోసం వీరు అలాంటి పనులు చేస్తున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి అలాంటి చెడు వ్యసనాలను, మత్తు పానీయాలు లేదా పదార్ధాల ప్రచారానికి  దూరం అంటున్నారట. అలాంటి అవకాశం వచ్చినా సామాజిక బాధ్యతగా తిరస్కరించినట్లు చెప్పారని సమాచారం. 

ఇక కెరీర్ పరంగా చూస్తే లావణ్య కొంచెం వెనుకబడ్డారు. చాలా తక్కువగా ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం లావణ్య చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ఏవన్ ఎక్స్ ప్రెస్, కార్తికేయ హీరోగా నటిస్తున్న చావు కబురు చల్లగా చిత్రాలలో లావణ్య హీరోయిన్ గా చేస్తున్నారు.