పరిశ్రమలో స్టార్ హీరోలు, నిర్మాతలు తమకు నచ్చినవారికి, తమ సిబ్బందికి బహుమతులు ఇవ్వడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. మంచి హిట్ సినిమా తెరకెక్కించినందుకు హీరో లేదా నిర్మాత సదరు డైరెక్టర్ కి ఎదో ఒక ఖరీదైన బహుమతి అందిస్తారు. అలాగే తమ వద్ద పనిచేసే సిబ్బందికి కూడా హీరోలు విలువైన బహుమతులు ఇచ్చి వారిని సంతోష పరుస్తారు. ఈ మధ్య రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ కి 73 లక్షల విలువైన రేంజ్ రోవర్ ని బహుమతిగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు. 

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ పెర్నాండెజ్ ఇదే విధంగా తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగిని సంతోష పరిచింది. జాక్విలిన్ అతనికి ఓ కొత్త కారును బహుమతిగా ఇచ్చింది. తన స్టాఫ్ మెంబర్ కి బహుమతిగా ఇచ్చిన కొత్త కారుకు స్వయంగా పూజలు చేసి, కొబ్బరి కాయ కొట్టి కారును అతనికి అప్పగించారు. ట్రాఫిక్ పోలీస్ యూనిఫార్మ్ లో ఉన్న జాక్విలిన్ రోడ్డుపై ఈ కార్యక్రమం నిర్వహించగా కొందరు వీడియో తీశారు. 

గత ఏడాది విడుదలైన సాహో మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన జాక్విలిన్, సుశాంత్ కి జంటగా డ్రైవ్ మూవీలో నటించారు. ఈ ఏడాది జాక్విలిన్ చేతిలో నాలుగు చిత్రాల వరకు ఉన్నాయి. జాన్ అబ్రహం కి జంటగా అటాక్ మూవీలో నటిస్తుండగా... సల్మాన్ కి జంటగా కిక్ 2లో నటించే అవకాశము దక్కించుకుంది. కిక్ సినిమాకు సీక్వెల్ గా కిక్ 2 వస్తుండగా, ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా జాక్విలిన్ నటించింది.