మలయాళ బ్యూటీ అమలా పాల్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నలుగుతూ ఉంటుంది. పర్సనల్ గా ప్రొఫెషనల్ గా అమలాపాల్ పై అనేక ఆరోపణలు రావడం జరిగింది. అమలా పాల్ మరో వివాదంతో వార్తలలో నిలిచింది. తన మాజీ ప్రియుడు ముంబైకి చెందిన భవీంధర్ సింగ్ పై చట్టపరమైన చర్యలకు ఆమె సిద్ధం అవుతున్నారు. ఆయనపై అమలా పాల్ పరువునష్టం దావా కేసు వేయనున్నట్లు సమాచారం అందుతుంది. 

సింగర్ భవీంధర్ తన చర్యల ద్వారా తన గౌరవానికి భంగం కలిగించాడనేది అమలా పాల్ ఆరోపణగా ఉంది. వృత్తి రీత్యా తనతో దిగిన కొన్ని ఫోటోలను భవీంధర్ దుర్వినియోగం చేశారని, తప్పుడు హెడ్డింగ్స్ తో ప్రజలకు దురాభిప్రాయం కలిగేలా చేశారని అమలా పాల్ ఆరోపిస్తున్నారు. ఆ ఫోటోలను ఎటువంటి మాధ్యమాల్లో భవీంధర్ పంచుకోకుండా ఆదేశించడంతో పాటు, పరువు నష్టం దావా వేసేలా చర్యలు తీసుకొనేలా అనుమతి ఇవ్వాలని చెన్నై హై కోర్ట్ లో అప్పీల్ చేశారు. అమలా పాల్ వాదన విన్న జడ్జి, భవీంధర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. 

కొద్దినెలల క్రితం భవీంధర్, అమలాపాల్ సాంప్రదాయ దుస్తులలో దంపతులుగా ఉన్న ఫోటోలు బయటికి రావడం జరిగింది.దీనితో అమలాపాల్, భవీంధర్ పెళ్లి చేసుకున్నారని వరుస కథనాలు వెలువడ్డాయి. కేవలం అవి ఓ ఫోటో షూట్ కోసం దిగిన ఫోటోలు మాత్రమే, నేను భవీంధర్ ని పెళ్లి చేసుకోలేదని అమలాపాల్ వివరణ ఇవ్వడం జరిగింది. ఇక 2014లో దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకున్న అమలాపాల్ 2017లో విడాకులు తీసుకొని విడిపోయింది.