సెన్సార్ బోర్డ్ కి లంచం ఇచ్చా.. హీరో విశాల్ సంచలన ఆరోపణలు..
హిందీలో `మార్క్ ఆంటోని` చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు విశాల్. అందుకోసం సినిమాని ముంబయిలోని సెన్సార్ బోర్డ్ కి పంపించారట. అయితే వాళ్లు సెన్సార్ చేయడానికి లంచం అడిగారట.

హీరో విశాల్ ఇటీవల `మార్క్ ఆంటోని`తో విజయాన్ని అందుకున్నారు. ఎస్ జే సూర్య, సునీల్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలైంది. సెప్టెంబర్ 15న విడుదలై ఇక్కడ మంచి ఆదరణ పొందడంతో ఇప్పుడు హిందీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విశాల్‌కి షాకింగ్ కి ఎక్స్ పీరియెన్స్ ఎదురైంది. తాను సెన్సార్ బోర్డ్ కి లంచం చెల్లించాల్సి వచ్చిందట. తాజాగా ముంబయి సెన్సార్ బోర్డ్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
హిందీలో `మార్క్ ఆంటోని` చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు విశాల్. అందుకోసం సినిమాని ముంబయిలోని సెన్సార్ బోర్డ్ కి పంపించారట. అయితే వాళ్లు సెన్సార్ చేయడానికి లంచం అడిగారట. దీంతో తప్పని పరిస్థితులో తాను ఆరు లక్షల లంచం ఇచ్చినట్టు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెబుతూ ఓ వీడియోని పోస్ట్ చేశాడు విశాల్. ఇందులో ఆయన సంచలన ఆరోపణలు చేయడంతోపాటు తాను డబ్బులు పంపించిన అకౌంట్ డిటెయిల్స్ కూడా పోస్ట్ చేయడం గమనార్హం.
ఇందులో విశాల్ చెబుతూ, సినిమాల్లో అవినీతిని చూపించడం వరకు బాగానే ఉంది. కానీ రియల్ లైఫ్‌లో దీన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే ముంబయిలోని సీబీఎఫ్‌సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఆఫీసుల్లో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా `మార్క్ ఆంటోనీ` హిందీ వెర్షన్ సెన్సార్ కోసం 6.5లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి నేను రెండు లావాదేవీలు చేశాను. ఒకటి స్క్రీనింగ్ కోసం మూడు లక్షల, రెండు సర్టిఫికేట్ కోసం మరో మూడున్నర లక్షలు చెల్లించాను. నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఫేస్ చేయలేదు.
ఈ రోజు సినిమా విడుదలైనప్పటి నుంచి మధ్య వర్తికి చాలా ఎక్కువ డబ్బు చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. ఈ విషయాన్ని మహారాష్ట సీఎం ఏక్ నాథ్‌షిండే, ప్రధాని మోడీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను ఇలా చేయడం నా కోసం కాదు, భవిష్యత్‌లో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశమే లేదు. అందరి కోసమే నా వద్ద ఉన్న సాక్ష్యాలు కూడా పెడుతున్నా, నిజం ఎప్పటికీ గెలుస్తుందని ఆశిస్తున్నా, గుడ్ బాయ్` అని పేర్కొన్నారు విశాల్. దీంతో ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌అవుతుంది. హాట్ టాపిక్‌గా మారింది.