ఇటీవల 'సుబ్రమణ్యపురం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సుమంత్.. కొద్దిరోజుల గ్యాప్ తోనే 'ఇదం జగత్' అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో తను హీరో కాదంటున్నాడు సుమంత్.

అలాగని విలన్ క్యారెక్టర్ కూడా కాదని, తన పాత్ర కొత్తగా ఉంటుందని అంటున్నాడు. తన పాత్ర గురించి చెబుతూ.. ''ఇదం జగత్ అనేది డార్క్ క్రైమ్ థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కించారు. ఇందులో నేను హీరో కాదు, విలన్ కూడా కాదు.. ఒక మనిషిలో మంచి-చెడు రెండూ ఉంటాయి. ఆ రెండూ ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి.

మీడియాపై సెటైరికల్ గా ఈ సినిమా ఉంటుంది. ఒక జర్నలిస్ట్ ఎంత స్వార్ధంగా ఆలోచిస్తాడు, ఎంత చెడుగా వ్యవహరిస్తాడో ఈ సినిమాలో చూపించాం. మీడియాలో ఉండే నెగెటివ్ కోణాన్ని ఇందులో చూపించాం.

అలా అని మీడియాకి ఈ సినిమా వ్యతిరేకం కాదు. ఉన్నది ఉన్నట్లుగా ఈ సినిమాలో చూపించాం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా చూసి కొంతమంది తనను తిట్టుకుంటారని అంటున్నాడు ఈ హీరో.