సిద్దార్థ్‌ హీరోగా నటిస్తూ నిర్మించిన `చిన్నా` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా  ఆయన హైదరాబాద్‌లో తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈసందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

హీరో సిద్ధార్థ్‌ స్టేజ్‌పైనే ఎమోషనల్‌ అయ్యారు. తనకు జరిగిన అవమానం గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లని దిగమింగుకుని ఎమోషనల్‌ వర్డ్స్ వెల్లడించారు. సిద్ధార్థ్‌ సినిమాని ఎవరు చూస్తారంటూ హేళనగా మాట్లాడరని ఆవేదన చెందారు. ఆయన తాజాగా `చిన్నా` చిత్రంలో నటించారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఎస్‌ యు అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కాబోతుంది. 

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సిద్ధార్థ్‌..మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. ఇటీవల ఆయనకు కర్నాటకలో జరిగిన అవమానం, దీనికితోడు తెలుగులో రిలీజ్‌కి సంబంధించిన చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తాను కష్టపడి `చిన్నా` సినిమా నిర్మించినట్టు తెలిపారు. కన్నడలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని, కష్టపడి కన్నడ నేర్చుకుని డబ్బింగ్‌ చెప్పి అక్కడ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేసినట్టు తెలిపారు.

నాలుగు నెలల ముందే నాలుగు భాషల్లో ఈ సినిమాని రిలీజ్‌ చేయాలనుకున్నాను. అందులో భాగంగానే కన్నడలో కూడా రిలీజ్‌ చేయాలని అక్కడ ప్రెస్‌ మీట్‌ పెట్టాను. నువ్వు తమిళోడివి ఇక్కడ నీకేం పని వెళ్లిపో అన్నారు. గొడవ చేశారు. అరే కష్టపడి సినిమా తీసి ప్రమోషన్‌ చేద్దామని నేనొస్తే ఇలా మాట్లాడారు. దీంతో పర్వాలేదనుకుని నేను అక్కడి నుంచి వచ్చేశా. ఈ సినిమాని సెప్టెంబర్‌ 28న `సలార్‌` చిత్రంతో రిలీజ్‌ చేయాలని 45రోజుల క్రితమే చెప్పాను. వస్తున్నట్టు ప్రకటించాను. ప్రభాస్‌కి నేను కూడా పెద్ద అభిమానిని, ఆయన సినిమా చూశాకే, నా సినిమా చూసుకుందామని అదే డేట్‌ని ప్రకటించాను.

కానీ అనూహ్యంగా `సలార్‌` సినిమా వాయిదా పడింది. దీంతో ఒకేసారి పది సినిమాలు వచ్చిపడ్డాయి. అదే సమయంలో నా సినిమాని చూసి ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదని తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌, మలయాళంలో గోకులం గోపాలం సర్‌, కన్నడలో `కేజీఎఫ్‌` సినిమాని నిర్మించిన వాళ్లు కొన్నారు. కానీ.. తెలుగు గురించి చెబుతూ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు సిద్ధార్థ్‌. కన్నీళ్లని దిగమింగుతూ తెలుగులో సిద్ధార్థ్‌ సినిమానా? ఎవరు చూస్తారని అడిగారు. 

నేను మంచి సినిమా చేస్తే, నా ప్రేక్షకులు నా సినిమాని చూస్తారని చెప్పా. మళ్లీ చెబుతున్నా, ఇది సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ కావాల్సిన చిత్రం. కానీ నా సినిమాలు ఎవరు చూస్తారని చెప్పి థియేటర్లివ్వలేదు. అలాంటి టైమ్‌లో మేమున్నామంటూ వచ్చి నా సినిమాని డిస్ట్రిబ్యూట్‌ చేయడానికి వచ్చింది ఏషియన్‌సునీల్‌ గారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు సిద్ధార్థ్‌.