Asianet News TeluguAsianet News Telugu

లవ్‌ స్టోరీస్‌తో విసిగిపోతున్నా.. సిద్ధార్థ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. `బొమ్మరిల్లు 2`పై ఏమన్నాడంటే

`టక్కర్‌` సినిమాతో మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న హీరో సిద్ధార్థ్‌ లవ్‌ స్టోరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లవ్‌ స్టోరీస్‌ చేసి విసిగిపోయానని తెలిపారు.  

hero siddharth bold comments on love stories  also react on bommarillu 2 arj
Author
First Published Jun 7, 2023, 8:38 PM IST

హీరో సిద్ధార్థ్‌.. అంటే లవ్‌ స్టోరీస్‌కి కేరాఫ్‌. ఆయన లవ్‌ స్టోరీ సినిమాలతో హీరోగా ఎదిగాడు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. తెలుగులో `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `బొమ్మరిల్లు`, `ఓయ్‌`, `చుక్కల్లో చంద్రుడు`, `కొంచెం ఇష్టం కొంచెం కష్టం` ఇలా ప్రారంభంలో వచ్చిన సినిమాలన్నీ లవ్‌ స్టోరీ నేపథ్యంలో వచ్చినవే. ప్రస్తుతం వాటికి బ్రేక్‌ చేస్తూ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేశారు. `టక్కర్‌` సినిమాతో వస్తున్నారు. కార్తిక్‌ క్రిష్‌ దర్శకత్వం వహించగా, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇది ఈ నెల 9న రిలీజ్‌ కాబోతుంది.

ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లవ్‌ స్టోరీస్‌ చేసి విసిగిపోయానని తెలిపారు. ఇకపై అలాంటి సినిమాలు చేయనని వెల్లడించారు. ఈ సందర్భంగా సిద్దార్థ్‌  చెబుతూ, ప్రేమకథ అనేది భావోద్వేగంతో కూడిన, అలసిపోయే ప్రయాణం. ఒక్కసారి లవ్ స్టోరీలు చేస్తే ఆ జోనర్‌లోనే కొనసాగాలని ఇండస్ట్రీలో ఒక అభిప్రాయం ఉంది. ప్రేమ కథలలో కూడా కొందరు రాబోయే సంవత్సరాల్లోనూ ప్రభావితం చేసేలా చిత్రాలను రూపొందించారు. అయితే, నేను సక్సెస్‌ఫుల్‌ లవ్‌ స్టోరీస్‌ చేస్తే, రాబోయే దశాబ్దం వరకు నాకు అలాంటి అవకాశాలే వచ్చే ప్రమాదం ఉంది.అందుకే ఇకపై వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు చెప్పారు సిద్ధార్థ్‌. 

తెలుగులో మళ్లీ సినిమాలు చేయడంపై ఆయన రియాక్ట్ అవుతూ, ఇతర భాషలతో పోల్చితే తెలుగు చాలా ప్రత్యేకమైనదని, దానికి ఎస్.ఎస్.రాజమౌళి  ఓ బ్రాండ్‌గా మారారు. టాలీవుడ్‌లో ఒక చిత్రానికి బలమైన రచన తోడైతే అది ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. గతంలో దర్శకులు వంద చిత్రాలను రూపొందించేవారు, కానీ ఇప్పుడు ఒక్క సినిమా తీయడానికి దాదాపు నాలుగేళ్లు పడుతోంది. నేను తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదని ఎదురవుతున్న ప్రశ్నలకు, భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాను నేనెప్పుడూ తిరస్కరించను. మన దేశంలో థియేటర్లలో ప్రదర్శించబడే చిత్రాలపై తెలుగు ప్రేక్షకులకు అమితమైన ప్రేమ ఉంటుంది. ఇలాంటి ప్రేక్షకులు, అభిమానులు అరుదుగా ఉంటారు. తెలుగు అభిమానులు నన్ను పక్కింటి అబ్బాయిగా భావించి, నన్ను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మీరు ఎక్కడికి వెళ్లినా, ప్రజల నుండి నాకు లభిస్తున్న అపారమైన ప్రేమ, మద్దతు లభిస్తుంది. ప్రేక్షకులకు, నాకు మధ్య బలమైన, విడదీయరాని బంధం ఉంది. అందుకే ఇక్కడ ఎప్పటికీ  గుర్తిండిపోయే చిత్రాన్ని రూపొందించాలనేది నా కల. అందుకు నాకు కొంత సమయం కావాలి. తమిళంలో ఐదు సినిమాలు నిర్మించాను, కానీ నా అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇంకా రాలేదు. ప్రస్తుతం `చిన్నా` పేరుతో ఓ సినిమా చేస్తున్నా. దీన్ని నా స్వంత బ్యానర్‌లో నిర్మిస్తున్నా. దీనికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు వస్తాయని నమ్ముతున్నా. 

`టక్కర్` సినిమా గురించి చెబుతూ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.  హీరో-హీరోయిన్ మధ్య ఘర్షణ, హీరో-విలన్‌ మధ్య ఘర్షణ, అహం, లింగం, వయస్సు, డబ్బు ఇలా అనేక ఘర్షణలు ఉంటాయి. హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ షిప్ లో చాలా షేడ్స్ ఉంటాయి. డబ్బు సంపాదించాలనే కోరికతో, హీరోని కిడ్నాపర్‌గా మారేలా పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. నిరాశ అతని లక్ష్యాలను నిర్దాక్షిణ్యంగా కొనసాగించేలా చేస్తుంది. కొడుకు, తల్లి మధ్య సాగే కీలకమైన డైలాగ్ సినిమా సారాంశాన్ని తెలుపుతుంది` అని చెప్పారు. 

`బొమ్మరిల్లు 2` గురించి సిద్ధార్థ్‌ చెబుతూ, "బొమ్మరిల్లు` సినిమాకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాలోని భావోద్వేగాల లోతు సాటిలేనిది. దీన్ని మించిన భావోద్వేగాలను అందించడమనేది పెద్ద సవాల్‌తో కూడుకున్నది. ఒకవేళ అలాంటి ఎమోషన్స్ అందించగలమని, నేటి ట్రెండ్‌కి సరిపోయే కథ వచ్చినప్పుడు చేస్తాం. కానీ `బొమ్మరిల్లు` మ్యాజిక్‌ని సీక్వెల్‌లో పునఃసృష్టి చేయడం చాలా కష్టమైన పని` అని అన్నారు సిద్ధార్థ్‌. తదుపరి చిత్రాల గురించి `ఇండియన్-2`లో నటిస్తున్నట్టు, అలాగే మాధవన్, నయనతారతో 'టెస్ట్', కార్తీక్ క్రిష్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు సిద్ధార్థ్‌.

Follow Us:
Download App:
  • android
  • ios