చట్టం ముందు అందరూ సమానమే అని గుర్తు చేయటానికా అన్నట్లు కొన్ని సంఘటనలు జరుగుతూంటాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు తప్పు చేస్తే పోలీస్ లు చూసి చూడనట్లు వెళ్లిపోతారని అనుకుంటాం. కానీ ఇవి సోషల్ మీడియా రోజులు. అలాంటిదేమన్నా జరిగితే వెంటనే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగిపోతోంది. దాంతో పోలీస్ లు చాలా ఎలర్ట్ గా ఉంటున్నారు. సెలబ్రెటీలు కూడా ఎలర్ట్ గా ఉండాల్సిన పరిస్దితి. ఇంతకీ ఇదంతా ఎందుకూ అంటే రామ్ కు తాజాగా హైదరాబాద్ పోలీస్ లు జరిమానా వేసారు. 

అందుకు కారణం బహిరంగ ప్రదేశంలో పొగ త్రాగడమే. బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగటం అనేది నిషేధం అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు ప్రతీ  సినిమా ప్రారంభం కంటే ముందు భారత ప్రభుత్వంచే జారీ చేయబడిన.. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం.. బహిరంగ ప్రదేశంలో ధూమపానం నిషేధం అనే ప్రకటనను చూస్తూనే ఉంటాం. అయితే ఈ విషయం మర్చిపోయారో ఏమో కానీ రామ్ పొగ తాగుతూ పోలీస్ లు దొరికారు.

అయితే తాను ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న  ఇస్మార్ట్ శంకర్ షూటింగ్‌లో భాగంగా బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగానంటున్నారు. దాంతో రామ్ బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగినందుకు ఆయనకు హైదరాబాద్ పోలీసులు రూ. 200 జరిమానా విధించారు. 

సినిమా విషయానికి  వస్తే.. ప్రపంచ క్రికెట్‌ కప్‌ ప్రభావం 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రం విడుదలపై పడింది. ఆ మ్యాచ్‌ ఫైనల్‌ ఈ చిత్రం రిలీజ్‌ తర్వాత ఉండడంతో ఊహించిన ఆదరణ లభించదని భావించి విడుదలను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జులై 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అదే నెల 14న వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌ జరగనుంది. ఇది బాక్సాఫీస్‌పై ఎఫెక్ట్‌ పడుతుందని దర్శక నిర్మాతలు భావించి ఈ సినిమాని జులై 18న విడుదల చేయాలని భావించారు.

రామ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణ జరుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.