హీరో రాజశేఖర్‌ కరోనాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం ఆయనకు, ఆయన ఫ్యామిలీకి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరారు. అయితే వారిలో రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని ఆయన కుమార్తె శివాత్మిక వెల్లడించింది. దీంతో చిరంజీవి, మోహన్‌బాబు వంటి సినీ వర్గాలు స్పందించి ధైర్యాన్నిచ్చారు. అదే సమయంలో సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు రాజశేఖర్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఇస్తున్నారు. 

శనివారం సాయంత్రం రాజశేఖర్‌ హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ స్థాయిలు ఆరోగ్యకరంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ట్రీట్‌మెంట్‌కి సహకరిస్తున్నారని చెప్పారు. తమ వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్‌ చివరగా గతేడాది `కల్కి` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా మరేది ఇంకా కన్ఫమ్‌ కాలేదు.