మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయం సాధించిన తరువాత అందులో ఉన్న సభ్యుల మధ్యనే గొడవలు జరగడం మొదలయ్యాయి. 'మా' అధ్యక్షుడు నరేష్ కి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ కి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఈ క్రమంలో నరేష్ కి షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి రాజశేఖర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

శివాజీరాజా 'మా' అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న నరేష్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శివాజీరాజాపై పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు నరేష్. నరేష్ ప్యానెల్ లో జీవిత, రాజశేఖర్ దంపతులకు మంచి పదవులు దక్కాయి.

మొదట్లో అందరూ బాగానే ఉన్నారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న కొన్ని పరిణామల వల్ల వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నరేష్ తన ప్యానెల్ సభ్యులతో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం సభ్యులకు నచ్చడం లేదు.

ఇప్పటికే నటి హేమ ఈ విషయంపై కామెంట్స్ చేసింది. ఇప్పుడు రాజశేఖర్ దంపతులు కూడా ఈ విషయంలో గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నరేష్ కి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జీవితరాజశేఖర్ దంపతులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ వివాదం ఎక్కడవరకు వెళ్తుందో చూడాలి!