కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎన్ఎంసి బిల్లు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు రెండు తెలుగురాష్ట్రాల్లో నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు సంఘీభావం తెలుపుతున్నారు. సినీ హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత, కుమార్తె శివాని ఈ ధర్నాలో పాల్గొని జూనియర్ డాక్టర్లకు మద్దతు తెలిపారు. 

రాజశేఖర్ స్వతహాగా వైద్యుడైన సంగతి తెలిసిందే. రాజశేఖర్ కుమార్తె శివాని కూడా డాక్టర్ చదువుతోంది. రాజశేఖర్ మాట్లాడుతూ.. నరేంద్రమోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం ఎన్ఎంసి బిల్లుని ప్రవేశపెట్టడం సరికాదని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేలోపు మరోమారు ఇందులో పొరపాట్లని సరిచేయాలని రాజశేఖర్ కోరారు. 

నేను మోడీగారిని తప్పుపట్టడం లేదు. కానీ ఆయన నమ్మిన మనుషులు కొందరు సరిగా చేయడం లేదు. కేంద్ర హెల్త్ మినిష్టర్ గా హర్షవర్ధన్ ఉన్నారు. ఆయన ఓ వైద్యుడు. ఓ వైద్యుడిగా ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఓ వైద్యుడిగా అడ్డదారుల్లో వైద్య విద్యని నేర్పించడాన్ని నేను అంగీకరించలేను. ఇలాంటి బిల్లులు ప్రవేశపెడితే ఎలాంటి వారికైనా వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని రాజశేఖర్ హెచ్చరించారు.