చంద్రముఖి 2 ప్లాప్... నా డబ్బులు నాకొచ్చేశాయంటూ లారెన్స్ ఆసక్తికర కామెంట్స్
చంద్రముఖి 2 ఫలితంపై రాఘవ లారెన్స్ ఓపెన్ అయ్యాడు. ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
లారెన్స్ లేటెస్ట్ మూవీ జిగర్తాండ డబుల్ ఎక్స్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. ఎస్ జే సూర్య మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ దీపావళి కానుకగా విడుదల కానుంది. జిగర్తాండ డబుల్ ఎక్స్ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 ఫలితం మీద స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ''చంద్రముఖి 2 చిత్రానికి నా డబ్బులు నాకు వచ్చేశాయి. ప్రతిసారి గెలుపు మనదే కావాలంటే కుదరదు. ఒకప్పుడు గ్రూప్ డాన్సర్ నుండి డాన్స్ మాస్టర్ అయితే చాలు అనుకున్నాను. దర్శకుడు, హీరో కూడా అయ్యాను. నా గ్లామర్ కి హీరో అవకాశాలు రావడమే అదృష్టం. అందులో జయాపజయాల ప్రస్తావన అనవసరం.
నేను హీరో కావడం దేవుడిచ్చిన వరం. జిగర్తాండ డబుల్ ఎక్స్ డబ్బింగ్ పూర్తి అయ్యాక చూశాను. ఈ మూవీలో మంచి కథ ఉంది. ఎంత పెద్ద హీరో ఉన్నా కథ లేకపోతే సినిమా ఆడదు. ఈ విషయంలో కార్తీక్ సుబ్బ రాజ్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది'' అన్నారు.
ఇక కాంచన 4 ఎప్పుడు ఉంటుందని అడగ్గా... అన్నీ దెయ్యాల సినిమాలు తీస్తుంటే మనశ్శాంతి లేకుండా పోతుంది. కలలో కూడా అవే వస్తున్నాయి. మనసు పిచ్చి పిచ్చిగా మారిపోయింది. అయితే కాంచన 4 ఖచ్చితంగా భవిష్యత్ లో చేస్తాను, అన్నాడు. సెప్టెంబర్ 28న విడుదలైన చంద్రముఖి 2 మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో ఓ మోస్తరు వసూళ్లు అందుకుంది. తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది. కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది.