Asianet News TeluguAsianet News Telugu

థియేటర్ల సమస్యలు పరిష్కరించకుంటే.. తర్వాతి తరానికి థియేటర్లుండవ్‌ః హీరో నాని ఆవేదన

`తిమ్మరుసు` సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. నేచురల్‌ స్టార్‌ నాని గెస్ట్ గా హాజరయ్యారు. 

hero nani shocking comments on theater problems in thimmarusu pre release event  arj
Author
Hyderabad, First Published Jul 28, 2021, 9:46 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

`థియేటర్ల సమస్యలు చిన్నవి కావని, చాలా పెద్ద సమస్యలని, ఆ ప్రాబ్లమ్స్ పరిష్కరించకపోతే మన తర్వాతి తరానికి థియేటర్లుండవ్‌` అని నేచురల్‌ స్టార్‌ నాని అన్నారు. సినిమాకి మించిన వినోదం మరోటి లేదని స్పష్టం చేశారు. సత్యదేవ్‌, ప్రియాంక జువాల్కర్‌ జంటగా, శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేష్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మించిన చిత్రం `తిమ్మరుసు`. ఈ నెల 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. సెకండ్‌ వేవ్‌ కరోనా తగ్గిన తర్వాత థియేటర్లు ఓపెన్‌ అయ్యాక విడుదల కాబోతున్న తొలి చిత్రమిది. 

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. నేచురల్‌ స్టార్‌ నాని గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని ఆసక్తికర, షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ, `కరోనా సమయంలో అన్నిటికంటే ముందే థియేటర్లు మూసేస్తున్నారు. అన్నిటికంటే చివర్లో తెరుస్తున్నారు. బయట ఉండే ఇతర ప్రదేశాల కంటే థియేటర్స్‌ చాలా సురక్షితం. థియేటర్‌లో ఒకరితో ఒకరం మాట్లాడుకోం.. మాస్క్‌లు వేసుకుని సినిమా చూస్తాం.

థియేటర్‌ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈ కుటుంబంపై లక్షల మంది ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. థియేటర్ల మూత వల్ల వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కానీ, సినిమా విషయాని కొచ్చేసరికి చిన్న సమస్యగా ఆలోచిస్తున్నారు. కానీ ఇది చాలా పెద్ద సమస్య. పరిస్థితులు చక్కబడకుంటే మన తర్వాతి తరం థియేటర్స్‌ అనుభూతిని మిస్‌ అవుతారు. అప్పటిక థియేటర్లుండవ్‌` అని తన ఆవేదన వ్యక్తం చేశారు నాని. 

ఇంకా చెబుతూ, `సత్యదేవ్‌ అంటే నాకు నటుడిగా, వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఈ సినిమాతో తనకు స్టార్‌డమ్‌ వస్తుంది. కరోనా థర్డ్‌వేవ్‌లాంటివేవీ రాకుండా మళ్లీ మనం థియేటర్స్‌లో సినిమాలు చూడాలి.  `తిమ్మరుసు` చిత్రం మొదలు `టక్‌ జగదీశ్`, `లవ్‌స్టోరీ`, `ఆచార్య`, `రాధేశ్యామ్`, `ఆర్‌ఆర్‌ఆర్` ఇలా అన్ని సినిమాలను మనం థియేటర్స్‌లో ఎంజాయ్‌ చేయాలి. `తిమ్మరుసు` హిట్‌ అయ్యి ఈ నెల 30 నుంచి విడుదలయ్యే సినిమాలకు ఆక్సిజన్‌ ఇవ్వాలి. నా కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తా` అని తెలిపారు.   

హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ, `ఫిల్మ్‌ ఇండస్ట్రీ అన్నది ఓపెన్‌ యూనివర్సిటీ. ఎవరైనా సరే ప్యాషన్‌తో రావాలి.. కష్టపడి నిరూపించుకోవాలి. ఇక్కడ సక్సెస్‌ రేట్‌ అన్నది చాలా తక్కువ. ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి సక్సెస్‌ అయిన ఎంతో మందిలో నాని అన్న ఒకరు. నాలాంటి వారికి ఆయనే స్ఫూర్తి` అని చెప్పారు. నిర్మాత మహేష్‌ కొనేరు చెబుతూ, `తిమ్మరుసు` బాగా రావడానికి సపోర్ట్‌ చేసిన వారందరికీ థ్యాంక్స్‌. మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సక్సెస్‌ మీట్‌లో మరింత మాట్లాడతా` అని అన్నారు.   

చిత్ర దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి చెబుతూ, `యూనిట్‌ అంతా కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులు మాస్క్‌ ధరించి థియేటర్‌కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా` అని చెప్పారు. ఇందులో హీరోయిన్‌ ప్రియాంక జువాల్కర్‌, మ్యాంగో మ్యూజిక్‌ రామ్‌ వీరపనేని,  దర్శకులు వెంకటేశ్‌ మహా,  రాహుల్‌, తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios