నటీనటులను సెలబ్రిటీలు ఇంటర్వ్యూలు చేయడం ఈ మధ్య చూస్తున్నాం. తాజాగా దర్శకుడు శివ నిర్వాణ.. హీరో నానిని ఇంటర్వ్యూ చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'నిన్ను కోరి' వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' ప్రమోషన్స్ లో భాగంగా శివ నిర్వాణ నానిని ఇంటర్వ్యూ చేశారు.

'నీ సినిమాల్లో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది.. నీకు కథలు చెప్పే దర్శకులు ఎమోషనలా..? లేక నువ్వే ఎమోషనల్ కథలు ఎన్నుకుంటావా..?' అని శివ నిర్వాణ.. నానిని ప్రశ్నించాడు. 

దానికి నాని తన వద్దకు వచ్చే దర్శకులు ఎమోషనల్ గా ఉంటారని.. 'గ్యాంగ్ లీడర్' సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయని.. సాధారణంగా ఒక ఎమోషనల్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ లోనే ఏడుపోచ్చేస్తుందని.. వరుసగా అదే సీన్ ని రిపీట్ చేస్తే ఫస్ట్ వచ్చినంత ఫీల్ రాదనీ.. కానీ దర్శకుడు విక్రమ్ కుమార్ మాత్రం 
ఎన్ని సార్లు ఎమోషనల్ షాట్ తీసినా.. అన్ని సార్లు ఏడుస్తూ ఉంటాడని చెప్పుకొచ్చాడు నాని.

విక్రమ్ గనుక 'జెర్సీ' సినిమాను డైరెక్ట్ చేసి ఉంటే కోమాలోకి వెళ్లిపోయేవాడేమో అంటూ నవ్వేశాడు. విక్రమ్ చాలా సరదా మనిషని.. కానీ ఆ సరదాతనం బయటపడే సినిమా అతడు తీయలేదని.. 'గ్యాంగ్ లీడర్' సినిమాతో అది సాధ్యమైందని వెల్లడించాడు.