నాగ శౌర్య కొత్త కాంబినేషన్ సెట్ చేశారు. తదుపరి చిత్రం కోసం ధమాకా డైరెక్టర్ తో చేతులు కలిపారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందుతుంది.
ధమాకా మూవీతో వెలుగులోకి వచ్చాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. సినిమా చూపిస్త మావా, నేను లోకల్ చిత్రాలతో సత్తా చాటిన ఈ డైరెక్టర్ హలో గురూ ప్రేమ కోసమే చిత్రంతో పర్లేదు అనిపించుకున్నారు. చాలా గ్యాప్ తీసుకుని రవితేజతో మాస్ మసాలా ఎంటర్టైనర్ ధమాకా చేశారు. ఈ చిత్రం ఆయన గత చిత్రాలకు చాలా భిన్నమైంది. ధమాకా మిక్స్డ్ టాక్ తెచ్చుకుని కూడా సూపర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలో ధమాకా దర్శకుడికి ఆఫర్స్ వెల్లువెత్తున్నాయి. నాగ శౌర్య కోసం ఐరా క్రియేషన్స్ ఆయన్ని లాక్ చేశారు. నిర్మాత ఉషా ముల్పూరి ఆయనతో ఒప్పందం చేసుకున్నారు. మరి త్రినాథరావు నక్కిన అయినా నాగ శౌర్యను ప్లాప్స్ నుండి బయటపడేస్తాడో లేదో చూడాలి.
నాగ శౌర్య లేటెస్ట్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో నాగ శౌర్య కెరీర్ అయోమయంలో పడింది. కొనేళ్ళుగా విజయం కోసం నాగ శౌర్య అనేక ప్రయోగాలు చేశాడు. క్లాస్, మాస్, రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్... ఇలా అన్ని జోనర్స్ ట్రై చేశారు. ఎంత కష్టపడుతున్నా హిట్ తలుపు తట్టడం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీతో వెలుగులో వచ్చిన నాగ శౌర్య... ఛలో మూవీతో క్లీన్ హిట్ అందుకున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఆ చిత్రం నాగ శౌర్యకు ఇమేజ్ తెచ్చిపెట్టింది. చలో మూవీ విడుదలై దాదాపు ఐదేళ్లు అవుతుంది. మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు. అశ్వద్ధామ, లక్ష్యం చిత్రాల కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిత్రాలు నిరాశపరిచాయి.
వరుడు కావలెను, లక్ష్య, కృష్ణ వ్రింద విహారి చిత్రాలకు కనీస వసూళ్లు రాలేదు. ఇక లేటెస్ట్ రిలీజ్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి డిజాస్టర్ అంటున్నారు. నాగ శౌర్య కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ క్రమంలో నాగశౌర్య కెరీర్ ప్రమాదంలో పడిందన్న మాట వినిపిస్తోంది. కాగా గత ఏడాది నాగ శౌర్య వివాహం జరిగింది. బెంగుళూరుకి చెందిన అనూష శెట్టిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్. సొంతగా ఓ సంస్థను నడుపుతున్నారు.
