తమిళంలో 'అట్టకత్తి' సినిమాలో హీరోగా నటించి అప్పటినుండి అట్టకత్తిని ఇంటి పేరుగా మార్చుకున్న అట్టకత్తి దినేష్ ప్రస్తుతం 'ఇరందం ఉలగపోరిన్ కడైసి గుండు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు అథియాన్ అతిరాయ్ డైరెక్ట్ చేస్తున్నాడు. 

దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సినిమాలో దినేష్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. చిత్రీకరణలో భాగంగా హైవేపై లారీకి వేలాడుతూ నటించాడు.

అదే సమయంలో హైవేపై ఇండియన్ ఆర్మీ ప్రయాణిస్తోన్న వాహనం వెళుతోంది. వారు లారీకి వేలాడుతున్న దినేష్ ని చూసి లారీని ఓవర్ టేక్ చేసి ఆపేశారు. వెంటనే తుపాకీ తీసి దినేష్ కి గురి పెట్టారు. అదంతా సినిమా షూటింగ్ అని తెలియక జవానులు దినేష్ ప్రమాదకరంగా లారీ డ్రైవ్ చేస్తున్నాడని భావించారు.

ఇదంతా కొన్ని సెకన్లలో జరగడంతో ఏం చేయాలో అర్ధం కాని డైరెక్టర్ ఒక్కసారిగా అరిచేశాడట. కాస్త తేరుకొని ఇది సినిమా షూటింగ్ అని చెప్పిన తరువాత కానీ జవానులు దినేష్ తలపై నుండి తుపాకీ తీయలేదట. ఆ తరువాత దినేష్ కాసేపు వారితో ముచ్చటించినట్లు తెలుస్తోంది.