ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి (Bappi Lahiri Death) మరణం ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యంతో బప్పీ లహరి కన్నుమూశారు. బప్పీ లహరి మరణవార్త తెలుసుకున్న అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ బప్పీ లహరి మరణంపై స్పందించారు. 

''సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి మరణ వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. నేను నటించిన రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పురవ్వ చిత్రాలకు బప్పీ లహరి సంగీతం అందించారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను...'' అంటూ బాలకృష్ణ సోషల్ మీడియా సందేశం విడుదల చేశారు. 

తెలుగులో కూడా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు బప్పీ లహరి సంగీతం అందించారు. ఆయన పనిచేసిన బాలకృష్ణ (Balakrishna)రెండు చిత్రాలలో రౌడీ ఇన్స్పెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నిప్పురవ్వ మాత్రం పరాజయం పాలైంది. అయితే నిప్పురవ్వ సినిమా పాటలు ఆదరణ దక్కించుకున్నాయి. బప్పీ లహరి మరణం నేపథ్యంలో బాలకృష్ణ ఆయనతో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

కొన్నాళ్లుగా అనార్యోగంతో బాధపడుతున్న బప్పీ లహరి తుదిశ్వాస విడిచారు. నేడు ఉదయం ముంబై లోని ఓప్రైవేట్ హస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. 69 ఏళ్ల బప్పీ లహరి దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారట. నేడు ఆయన పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు చిత్రాలకు సంగీతం సమకూర్చడంతో పాటు పాటలు పాడి, తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్నారు బప్పీ లహరి. 2020 లో వచ్చిన బాఘీ 3 చిత్రానికి ఆయన చివరిసారిగా పనిచేశారు.