గత వారం విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ తనదేనని హీరో, రచయిత ఆకాష్ అంటున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ హీరోగా నటించాడు.

ఓ వ్యక్తి మెదడుని హీరోకి మార్పిడి చేయడమనే కాన్సెప్ట్ తో సినిమా రూపొందింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ.48 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వివాదంలో పడింది. ఈ కాన్సెప్ట్ తనదేనని హీరో ఆకాష్ అంటున్నారు.

ఇదే కాన్సెప్ట్ తో తెలుగు, తమిళ భాషల్లో తను హీరోగా డైరెక్టర్ రాధా సినిమా తీశారని, తమిళంలో ఇప్పటికే 'నాన్ యార్' పేరుతో విడుదలైందని.. తెలుగులో 'కొత్తగా ఉన్నాడు' టైటిల్ తో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. 

ఈ నేపధ్యంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రూపంలో షాక్ తగిలిందని.. ఈ విషయమై పూరి జగన్నాథ్ ని సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఆయన  అందుబాటులోకి రాలేదని చెప్పారు. దీంతో తమిళ నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేసి, పరిష్కారం కోసం మీడియాని ఆశ్రయించినట్లు చెప్పారు. 

తన వాదనను వినిపించడంతో పాటు ఆధారాలను కూడా మీడియాముందు పెట్టారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కాకపోతే చట్టపర చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.