గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఆయన ఫ్యాన్స్ మరియు సన్నిహితులు ఆందోళన పడుతుండగా, ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఇచ్చారు. ఆయన ఓ వీడియో సందేశం ద్వారా బాలు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ...నాన్న గారి ఆరోగ్యం నిన్నటితో పోల్చుకుంటే మెరుగైంది, ఆయన శ్వాసతీసుకోవడం కూడా మెరుగైంది. ఆయన వైద్యులను మరియు కుటుంబ సభ్యులను గుర్తుపడుతున్నారు. ఆయన ఐ సి యూలో లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ పై ఉన్నపటికీ వైద్యానికి స్పందిస్తున్నారు. ఈ విషయం ఎంతో ఆనందపరిచింది, అన్నారు.

 అలాగే చరణ్ తన తల్లి ఆరోగ్యం పై కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అమ్మ ఆరోగ్యం చాల మెరుగ్గా ఉందన్నారు. అలాగే త్వరలో ఆమె డిశ్చార్జ్ అవుతారని చెప్పడం జరిగింది.  ఇక బాలు పై ప్రేమ కురిపిస్తున్న , ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటున్న  అభిమానులకు చరణ్ ధన్యవాదాలు చెప్పారు. ఎస్పీ చరణ్ తాజా అప్డేట్ బాలు అభిమానులకు కొంచెం ఊరటను ఇచ్చింది. బాలుగారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారన్న నమ్మకం అందరిలో బలపడింది.

 రెండు వారాలు క్రితం బాలు తనకు కోవిడ్ సోకినట్లు ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. తనకు ఏమీకాదన్న ఆయన త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలు చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన భార్యకు కు కూడా కోవిడ్ సోకడంతో ఇదే ఆసుపత్రి నందు చికిత్స  తీసుకుంటున్నారు.