యంగ్ హీరో నితిన్ ని నూనూగు మీసాల వయసులోనే వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ. జయం చిత్రంతో నితిన్ టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. ఆ చిత్రం ప్రేమకథగా ఘనవిజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత తేజ దర్శకత్వంలో నితిన్ ధైర్యం చిత్రంలో నటించాడు. ధైర్యం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రాలేదు. 

దీనితో సహజంగానే నితిన్, తేజ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. పలు ఇంటర్వ్యూలలో తనపట్ల నితిన్ కు సరైన గౌరవం లేదని తేజ పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు, నితిన్ కు మధ్య గ్యాప్ ఎందుకు ఏర్పడిందో తేజ వివరించారు. వాస్తవానికి వివాదం నితిన్ తో కాదు.. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డితో. 

ధైర్యం సినిమా సమయంలో తనకు తెలిసిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఈ  సినిమాని కొనడానికి ముందుకు వచ్చాడని తేజ తెలిపారు. అప్పటికే నాకు ధైర్యం సినిమా బాగా ఆడుతుందని నమ్మకం లేదు. తెలిసిన వాడు కావడంతో 'ఇంట్లో భార్య పిల్లలు బావున్నారా.. అయితే నీ ఇష్టం అని ఆ డిస్ట్రిబ్యూటర్ తో అన్నా. తన మాటల్లో మర్మం అర్థం చేసుకున్న ఆ డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనకుండా వెళ్ళిపోయాడు. 

ఈ చిత్రాన్ని కొనవద్దని తానే చెప్పినట్లు ఆ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డికి చెప్పాడు. దీనితో సుధాకర్ రెడ్డి నన్ను నిలదీశారు. నేను సినిమా కొనొద్దని చెప్పలేదు.. భార్య పిల్లలు జాగ్రత్త అని మాత్రమే చెప్పా. దానర్థం అదేకదా అని సుధాకర్ రెడ్డి కోపగించుకున్నారు. ఆ చిత్రానికి 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నా. నష్టపరిహారంగా కోటి రూపాయలు నిర్మాతకు వెనక్కు ఇచ్చేసినట్లు తేజ తెలిపాడు. 

మొత్తంగా తేజ, నితిన్ మధ్య దూరం పెరగడానికి డిస్ట్రిబ్యూటర్ తో అన్న ఆ మాటే కారణం అయింది.