రివ్యూ: హలో గురు ప్రేమకోసమే
రెండేళ్ల క్రితం 'నేను శైలజ' సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో రామ్ ఆ తరువాత విజయం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోతున్నాయి.
నటీనటులు: రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, ప్రణీత తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: విజయ్ కె చక్రవర్తి
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
రెండేళ్ల క్రితం 'నేను శైలజ' సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో రామ్ ఆ తరువాత విజయం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో 'సినిమా చూపిస్త మావ','నేను లోకల్' వంటి సినిమాలు తీసి సక్సెస్ అందుకున్న దర్శకుడు త్రినాధరావు చెప్పిన 'హలో గురు ప్రేమకోసమే' అనే కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
సంజు(రామ్) కాకినాడలో ఇంజనీరింగ్ పూర్తి చేసి స్నేహితులతో జల్సాగా తిరుగుతుంటాడు. తన తల్లితండ్రుల కోసం హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటాడు. హైదరాబాద్ లో తన తల్లి స్నేహితుడు విశ్వనాథ్(ప్రకాష్ రాజ్) ఇంట్లో ఉండడానికి సిద్ధమవుతాడు సంజు. కాకినాడ నుండి హైదరాబాద్ కి వెళ్లే సమయంలో ట్రైన్ లో అనుపమ(అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయిని కావాలని ఆట పట్టిస్తాడు. ఆమె విశ్వనాథ్ కూతురని తెలుసుకొని ఆమె దగ్గర చాలా తగ్గి ఉంటాడు. అనుపమకి సారీ చెప్పేసి ఆమెతో స్నేహం చేస్తాడు.
ఉద్యోగంలో జాయిన్ అయిన తరువాత సంజు.. రీతూ(ప్రణీత) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే సంజు మాత్రం తను ప్రేమిస్తున్నది రీతూని కాదని, అనుపమని అని రియలైజ్ అవుతాడు. ఇంతలో అనుపమకి ఇంట్లో మరొక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమవుతాడు ఆమె తండ్రి విశ్వనాథ్. ఇంతకీ అనుపమ.. సంజుని ప్రేమిస్తుందా..? సంజు తన ప్రేమని గెలిపించుకుంటాడా.. లేక త్యాగం చేస్తాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
స్నేహం, ప్రేమ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ హీరోయిన్ తండ్రి.. హీరోతో స్నేహం చేయడం, అతడి ప్రేమకి హెల్ప్ చేయడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. అదే ప్లాట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరో రామ్ చెప్పినట్లు కథలో కొత్తదనం ఏదీ ఉండదు. కానీ అందరికీ తెలిసిన, ఊహించగలిగే సన్నివేశాలనే వినోదాన్ని జోడించి తెరపై ఆవిష్కరించారు. సినిమా మొదలైన కాసేపటికే స్టోరీ ఏంటనేది ప్రేక్షకులకు ఓ ఐడియా వచ్చేస్తుంది. కానీ సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టదు. దాదాపు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. హెల్తీ కామెడీతో కథను నడిపించారు. అనవసరపు ప్రాసలు, కుళ్లు జోకులకి తావివ్వకుండా.. సరికొత్త డైలాగ్స్, కామెడీతో నవ్వించారు.
కామెడీ కూడా సెపరేట్ ట్రాక్ మాదిరి కాకుండా కథలో భాగంగా ఉంటుంది. హీరో కంపనీలో జాయిన్ అయినప్పుడు అక్కడ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు, డేటాబేస్ అంటే ఏంటని అడిగితే.. తనకి తప్ప మరెవరికీ అర్ధం కాకుండా చెప్పే సమాధానం నవ్వులు పూయిస్తుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిన్న ట్విస్ట్ తో ఇంటర్వల్ పడుతుంది. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్, రామ్ లు స్నేహితులుగా మారిన తరువాత వారిద్దరి మధ్య నడిచే కొన్ని సంభాషణలు ఆకట్టుకుంటాయి. అయితే అప్పటివరకు ఎంటర్టైనింగ్ గా సాగిన కథ కాస్త స్లో అయిపోతుంది. హీరోయిన్ కి తండ్రి మీద ఉన్న గౌరవం, ప్రేమ గురించి చెప్పే సన్నివేశాలు విసిగిస్తాయి.
ఆ సన్నివేశాలు ఎమోషనల్ గా కాకుండా సాగదీసినట్లుగా అనిపించడంతో ఆడియన్స్ కి విసుగు రావడం ఖాయం. ప్రీక్లైమాక్స్ వరకు కూడా సినిమా రొటీన్ గా సాగుతూ విసిగిస్తునే ఉంటుంది. క్లైమాక్స్ లో తన స్నేహితుడి కోసం హీరోయిన్ ని త్యాగం చేయాలనుకునే హీరో నిర్ణయం ఆలోచింపదగిన విధంగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే కాసిన్ని నవ్వులు, ప్రకాష్ రాజ్-రామ్ ల ఎపిసోడ్ తో సినిమా బాగానే ఉందనిపిస్తుంది. హీరో రామ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటిలానే లవర్ బాయ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. అనుపమ తెరపై అందంగానే కనిపించింది.
రామ్-అనుపమల జంట ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. కూతురిని ఎంతగానో ప్రేమించే తండ్రిగా ప్రకాష్ రాజ్ తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరెవరినీ ఊహించుకోలేమ్.సినిమా మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది. ప్రణీత కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. తెరపై కనిపించినంత సేపు తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ లో ఏదొక మాట అంటూ ఎదుటివారికి పంచ్ లు వేస్తూ సీనియర్ నటి ఆమని కాసేపు నవ్విస్తుంది. దర్శకుడు త్రినాధరావు నక్కిన కథలో ఎలాంటి కొత్తదనం లేకపోయినా టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. కథనం కొద్దిగా బలహీనంగా, రొటీన్ గా అనిపించింది. దీంతో ఫలితం ఏవరేజ్ అనే స్థాయిలో నిలబడింది.
ఇకపోతే సినిమాలో ప్రతి సినిమాకి తన మ్యూజిక్ తో ప్రాణం పోసే దేవిశ్రీ ఈ సినిమాకు మాత్రం పెద్దగా ఉపయోగపడలేకపోయారు. ఆయన్నుండి ఇంకా మంచి ఔట్ అవుట్ ఫుట్ రాబట్టుకుని ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో లెంగ్త్ కొద్దిగా తగ్గించి ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో కామెడీ, రామ్-ప్రకాష్ రాజ్ ల ట్రాక్ మెప్పించే అంశాలు కాగా లవ్ ట్రాక్ పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేయకపోవడం, రొటీన్ గా అనిపించే కథనం, పసలేని సెకండ్ హాఫ్ నిరుత్సాహపరుస్తాయి. రెగ్యులర్ ఆడియన్స్ కి రొటీన్ గా అనిపించినా.. యూత్ కి ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రేటింగ్: 2.75/5