హైదరాబాద్ లో ఎండ తీవ్రతకు ఓ రష్యన్ వ్యక్తి మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్‌ (38) టూరిస్ట్ వీసాపై మార్చి నెలలో హైదరాబాద్ కి వచ్చారు.

మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో గచ్చిబౌలిలో డీఎల్ఎఫ్ గేటు నెంబర్ 1 వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పోలీసులు వెంటనే కొండాపూర్ లో ఓ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు గాంధీ హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ అలెగ్జాండర్‌ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు.

మృతుడికి చెందిన కెమెరాలో ఫోటోల ఆధారంగా ఈ నెల 4,5 తేదీల్లో 'సై రా' సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించినట్లు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి సమీపంలో హోటల్ లో నివాసమున్న అలెగ్జాండర్‌ ఆ తరువాత ఖాళీ చేసి రోడ్లపైనే తిరుగుతున్నారు.

వడదెబ్బ కారణంగా అలెగ్జాండర్‌ మృతి చెందారని.. గోవాలో ఉండే అతడి స్నేహితుడు బోరెజ్ కి సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. బోరెజ్ వచ్చిన తరువాత పోస్ట్ మార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.