యంగ్ హీరో హవీష్ ఒక్కో చిత్రంతో తన ప్రతిభని నిరూపించుకుంటూ రాణిస్తున్నాడు. హవీష్ తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కి సంతకం చేశాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే ఓ రొమాంటిక్ డ్రామా చిత్రంలో హవీష్ నటించనున్నాడు. ఈ చిత్రం బుధవారం రోజు హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ఈ చిత్ర లాంచింగ్ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ముహూర్తపు షాట్ కు సుకుమార్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సునీల్ నారంగ్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్ ని అందుకుంది. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. 

జులై నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలని సాయి శ్రీరామ్ నిర్వహించనున్నాడు. త్వరలో హవీష్ నటిస్తున్న థ్రిల్లర్ మూవీ సెవెన్ విడుదల కానుంది. ఈలోపు హవీష్ మరో ఆఫర్ అందుకోవడం విశేషం.