`హ్యారీ పోటర్` నటుడు కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు
`హ్యారీ పోటర్` చిత్రాల్లో డంబెల్ డోర్ పాత్రతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు మైఖేల్. తాజాగా ఆయన కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూశారు. `హ్యారీ పోటర్` చిత్రాలతో ఆకట్టుకున్న నటుడు మైఖేల్ గాంబన్ (82) గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని `హ్యారీ పోటర్` అధికారిక ట్విట్టర్ వెల్లడించింది. `సర్ మైఖేల్ గాంబన్ మరణ వార్త విని మేం చాలా బాధపడ్డాము, అతను హాస్యం, దయతో ప్రపంచం నలుమూలల నుంచి హ్యారీ పోటర్ అభిమానులకు ఎనలేని ఆనందాన్ని అందించాడు. ఆయన జ్ఞాపకాలతో ఎప్పటికీ ఉండిపోతాం` అని పేర్కొంది.
`హ్యారీ పోటర్` చిత్రాల్లో డంబెల్ డోర్ పాత్రతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు మైఖేల్. షేక్స్ స్పీయర్ కథల ఆధారంగా వచ్చే చిత్రాల్లోనూ ఆయన నటించి మెప్పించారు. ఆయా కథలకు ఆయన కేరాఫ్‌గా నిలిచారు. అయితే ఎక్కువగా `హ్యారీ పోటర్` సినిమాల్లో నటించడంతో ఆయన డంబెల్ డోర్‌గా పాపులర్ అయ్యారు. ఐరీష్‌కి చెందిన మైఖేల్.. చిన్నప్పుడే లండన్‌కి షిఫ్ట్ అయ్యారు. నటనపై ఆసక్తితో థియేటర్ లో ప్లేస్ చేశాడు.
ఆ తర్వాత టీవీలోకి వచ్చాడు. టీవీ పరిశ్రమ ఆయనకు నటుడిగా గుర్తింపు తెచ్చింది. అది సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. మొదటి హ్యారీపోటర్` చిత్రాల్లో డంబెల్ డోర్ పాత్రలో రిచర్డ్ హ్యారీస్ నటించారు. ఆయన చనిపోవడంతో మైఖేల్‌కి ఆ ఆఫర్ వచ్చింది. ఇలా `హ్యారీ పోటర్`కి సంబంధించిన ఆరు ఫ్రాంఛైజీల్లో నటించారు. 1965లో వచ్చిన `ఓతెల్లో` చిత్రంతో నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. `ది ఇన్ సైడర్`, `గాస్ఫోర్డ్ పార్క్`, `ది వింగ్స ఆఫ్ ది డోవ్`, `అమేజింగ్ గ్రేస్`, `ది కింగ్స్ స్పీచ్`, `క్వార్టెట్`, `విక్టోరియా అండ్ అబ్దుల్` వంటి చిత్రాల్లో నటించారు. అనేక అవార్డులు అందుకున్నారు. అందులో ప్రతిష్టాత్మక బాఫ్టా అవార్డులు కూడా ఉన్నాయి.
ఇక 82ఏళ్ల మైఖేల్ గత కొన్నాళ్లుగా న్యూమోనియోతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసుపత్రిలోనే కన్నుమూశారు. దీంతో హ్యారీ పోటర్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. హాలీవుడ్, ఇంగ్లీష్, ఐరీష్ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాయి. సినీ ప్రముఖులు మైఖేల్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.