స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వెంకటేష్ మహా పేరు ప్రస్తావించకుండా అతడికి ఒక రేంజ్ లో క్లాస్ పీకారు. బలగం చిత్ర సక్సెస్ మీట్ కి అతిథిగా హాజరైన హరీష్ హాజరయ్యారు.
కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా ఇటీవల ఇంటర్వ్యూలో కేజీఎఫ్ చిత్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో అతడిపై ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. కంచరపాలెం చిత్రంతో వెంకటేష్ మహా సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. వెంకటేష్ మహా కమర్షియల్ చిత్రాల గురించి మాట్లాడాడు. ఉదాహరణగా కేజీఎఫ్ చిత్ర కథని, హీరో యష్ పాత్రని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. ఏకంగా యష్ పాత్రని నీచ్ కమీన్ కుత్తే అంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ తల్లి పాత్రని తెరకెక్కించిన విధానం పై వెంకటేష్ మహా వెటకారంగా మాట్లాడడం చూశాం.
దీనితో వెంకటేష్ మహా చేసిన విమర్శలు సినీ ప్రియులకు నచ్చడం లేదు. ఈ వివాదంలో వెంకటేష్ మహా క్షమాపణ చెప్పినప్పటికీ అతడిపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వెంకటేష్ మహా పేరు ప్రస్తావించకుండా అతడికి ఒక రేంజ్ లో క్లాస్ పీకారు. బలగం చిత్ర సక్సెస్ మీట్ కి అతిథిగా హాజరైన హరీష్ మాట్లాడుతూ.. చాలా రోజులుగా చూస్తున్నా.. ఇది క్లాస్ సినిమా.. ఇది మాస్ మూవీ.. ఇది కమర్షియల్ సినిమా అంటూ విభజించి కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాని ఈ విధంగా విభిజించింది సులభంగా ఆ చిత్రాన్ని ప్రమోట్ చేయడం కోసం మాత్రమే. ఇలాంటి తేడాలు ప్రేక్షకుల్లో అసలు ఉండవు. ఆడియన్స్ చూసేది మంచి సినిమానా.. కాదా అని మాత్రమే చూస్తారు. శంకరాభరణం, సాగరసంగమం, సీతాకోక చిలుక లాంటి చిత్రాలకు జనాలు బండ్లు కట్టుకుని వెళ్లారు అని విన్నాం. ఆ చిత్రాల్లో సుమోలు, రక్తపాతాలు లేవు. ఆ చిత్రాలని చూసింది మాస్ ప్రేక్షకులే. మరి ఆ చిత్రాలని క్లాస్ మూవీస్.. మాస్ మూవీస్ అని ఎలా చెబుతాం.
300 కోట్ల సినిమా చేసినా.. 3 కోట్ల సినిమా చేసినా అది మన సినిమా అని భావించాలి. ఇండస్ట్రీ కలసి ఫైట్ చేయడానికి చాలా సమస్యలు బయట ఉన్నాయి. సినిమా పై దాడులు జరుగుతున్నాయి. ఓటిటి ప్రభావం లాంటి సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు పక్కన పెట్టి మనలో మనం ఫైట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకరిని పొగడడం కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి అనేది నాకు అర్థం కానీ విషయం అని హరీష్ అన్నారు.
కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు బాగా ఆడితే బయ్యర్ల దగ్గర బాగా డబ్బు ఉంటుంది. మన నెక్స్ట్ మూవీని మంచి ధర పెట్టి కొంటారు అనే భరోసా ఉంటుంది. లౌక్యం తెలిసినవాళ్ళు ఇలాగే ఆలోచించాలి అని హరీష్ శంకర్ అన్నారు.
