పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాడు. తన నెక్ట్స్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న `హరిహర వీరమల్లు` చిత్రీకరణ శుక్రవారం నుంచి స్టార్ట్ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమాని స్టార్ట్ చేశారు. ఇటీవల ఆయన `భీమ్లా నాయక్`తో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడు మరో సినిమాకి సిద్ధమవుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు` అనే సినిమా చేస్తున్న విసయం తెలిసిందే. ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కి ముందు ఆగిన ఈ చిత్ర షూటింగ్ మళ్లీ రీ స్టార్ట్ చేశారు. శుక్రవారం నుంచి చిత్రీకరణ జరుపుతున్నట్టు యూనిట్ ప్రకటించింది.
అంతకు ముందు పవన్ సెట్‌లో యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయా ఫోటోలను యూనిట్ పంచుకోగా, అవి వైరల్ అయ్యాయి. ట్రైనర్ల సారథ్యంలో పవన్ గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తన బాడీని సైతం ఉక్కులా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మేకోవర్ కొత్తగా ఉండటం విశేషం. ఆ వెంటనే గ్యాప్ లేకుండా చిత్రీకరణ మొదలు పెట్టారు. ప్రస్తుతం పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు ఈ చిత్రానికి సెట్ వర్క్ భారీగా ఉంటుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, `పద్మశ్రీ` తోట తరణి సారథ్యంలో సెట్ వర్క్ జరుగుతుంది. అయితే తాజాగా సెట్‌లో పవన్ కళ్యాణ్ ఆయన్నీ ఆహ్వానిస్తూ సత్కరించారు. శుక్రవారం తోట తరణి `హరిహర వీరమల్లు` షూటింగ్ స్పాట్ కి వచ్చిన సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ గారు పుష్పగుచ్చం అందించి హార్ధిక స్వాగతం పలికారు. పద్మశ్రీ పురస్కారాలు, జాతీయస్థాయి ఉత్తమ కళాదర్శక అవార్డులు అందుకున్న తరణి గారు నేతృత్వంలో ఈ చిత్రం సెట్స్ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఆయన రూపొందించే సెట్స్ సృజనాత్మక శక్తికి... అధ్యయన అభిలాషకు అద్దంపడతాయన్నారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి శ్రీ తరణి గారితో పరిచయం ఉందన్నారు.
ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, నర్గీస్ ఫక్రీ మరో హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే తిరుగుబాటు నాయకుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన పాత్ర చాలా శక్తివంతంగా ఉండబోతుంది. పీరియాడికల్ హిస్టరీ నేపథ్యంలో సాగే కథ కావడంతో పవన్ పలు యుద్ధ సన్నివేశాల్లోనూ కనిపించబోతున్నారని టాక్.
