“హరి హర వీరమల్లు” ద్వారా పవన్‌కళ్యాణ్, క్రిష్ కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం‘హరిహర వీరమల్లు’ . ‘హరిహర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.ఇది ఒక గొప్ప బందిపోటు వీరోచిత గాథ అని డైరెక్టర్ క్రిష్ ఇప్పటికే చెప్పారు. క్రిష్ తన ట్రేడ్‌మార్క్ అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇది భారతీయ సినిమాలో ఇప్పటిదాకా చెప్పని కథ. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ నేపధ్యంలో చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయి.
అయితే ఈ చిత్రం చాలా కాలం నుంచి నిర్మాణం జరుపుకుంటున్నా పూర్తి కావటం లేదు. దసరాకు ఈ చిత్రం రిలీజ్ ఉంటుందని భావించారు. అయితే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం దసరా రేస్ నుంచి తప్పుకున్నట్లే అని తెలుస్తోంది. దసరాకు రామ్,బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఖరారు అయ్యింది. అలాగే రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా థియేటర్స్ వస్తోంది. తమిళం నుంచి విజయ్ చేసిన లియో కూడా పోటీకి దిగుతోంది. అయితే పవన్ చేసిన హరి హర వీరమల్లు మాత్రం ఎక్కడా చడీ చప్పుడూ లేదు. ఈ సినిమా దీపావళి కు రిలీజ్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. దాంతో రామ్, రవితేజ సినిమాలు ఏ పోటీ లేకుండా దుమ్ము దులుపే అవకాసం ఉంది.
సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ “హరి హర వీరమల్లు నెక్స్ట్ లెవెల్ మూవీ. దీనికి అద్భుతమైన కథ ఉంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు తమ కాలర్‌ను పైకి ఎగరేస్తారు. గర్వంతో వారి చేతులను తమ హృదయాలపై ఉంచవచ్చు. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను” అంటూ సినిమాపై అమాంతంగా హైప్ పెంచేశారు. కాగా “హరి హర వీరమల్లు” ద్వారా పవన్‌కళ్యాణ్, క్రిష్ కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ కోసం చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించారు. అంటే.. ఏ విషయంలోనూ రాజీపడని ఉన్నతస్థాయి నిర్మాణ విలువలతో, రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు పీరియడ్ డ్రామా ఫిల్మ్ కావడంతో, వీఎఫ్ఎక్స్ పనుల కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించారు. పలు హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన బెన్ లాక్ వీఎఫ్ఎక్స్ వర్క్‌ను పర్యవేక్షిస్తారు.
పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి బాణీలు అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్‌తో ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు.
