Asianet News TeluguAsianet News Telugu

సిద్దార్థ్ గృహం మూవీ రివ్యూ రేటింగ్

  • నటీనటులు: సిద్ధార్థ్, ఆండియ్రా జెర్మియా, అనీషా ఏంజెలీనా విక్టర్, అతుల్ కులకర్ణి, సురేష్,
  • దర్శకత్వం: మిలింద్ రావ్
  • నిర్మాత: సిద్ధార్థ్
  • సంగీతం: గిరీష్
  • సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
  • ఎడిటింగ్: లారెన్స్ కిషోర్
  • కథ, స్క్రీన్ ప్లే: మిలింద్ రావ్, సిద్ధార్థ్
  • ఆసియానెట్ రేటింగ్: 2.75/5 
gruham movie review

హారర్ జోనర్ లో ఇటీవల కాలంలో కొంత హాస్యం ఎక్కువై జోనర్ కామెడీ హారర్ అయిపోయింది. అయితే హారర్ అంటే భయం అనే కాన్సెప్ట్ తో పక్కాగా భయపెట్టే సినిమాలు వస్తే ఆదరించే ప్రేక్షకులు ఇప్పటికీ వున్నారు. దుకే ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నం చేశాడు సిద్దార్థ్‌. క‌థానాయ‌కుడిగా వ‌రుస అప‌జ‌యాలు ఎదుర్కొంటున్న త‌రుణంలో, తానే నిర్మాత‌గా మారి ఓ హార‌ర్ క‌థతో గృహం మూవీ తీశాడు. త‌మిళ‌నాట విడుద‌లై సక్సెస్ అందుకొన్న గృహం… తెలుగులోనూ సక్సెస్ అవుతుందా. ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలేమున్నాయి..

 

క‌థ‌:

క్రిష్ (సిద్దార్థ్‌) ఓ డాక్ట‌ర్‌. త‌న భార్య ల‌క్ష్మి (ఆండ్రియా)తో క‌ల‌సి ఆనంద‌క‌ర‌మైన జీవితం సాగిస్తుంటాడు. వీళ్ల ఇంటికి ఎదురుగా పాల్ (అతుల్ కుల‌క‌ర్ణి) కుటుంబం దిగుతుంది. వాళ్ల‌మ్మాయి జెన్నీ… చాలా అల్ల‌రి పిల్ల. క్రిష్‌ని స‌ర‌దాగా ఆట ప‌ట్టిస్తుంటుంది. క్రిష్ – జెన్నీల సాన్నిహిత్యం చూసి ల‌క్ష్మి కూడా కుళ్లుకుంటుంది. క్రిష్ – పాల్ కుటుంబాలు బాగా ద‌గ్గ‌ర‌వుతాయి. అయితే క్ర‌మంగా జెన్నీ ప్ర‌వ‌ర్త‌న‌లో చాలా మార్పు వ‌స్తుంది. స‌డ‌న్‌గా ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తుంటుంది. వెర్రిగా కేక‌లు వేస్తుంటుంది. ‘ఈ ఇంట్లోంచి వెళ్లిపోండి. లేదంటే మిమ్మ‌ల్ని చంపేస్తా’ అంటూ చైనీస్ భాష‌లో అరుస్తుంటుంది. జెన్నీలో లీజింగ్ అనే దెయ్యం ఆవ‌హించింద‌ని అర్థం అవుతుంది. లీజింగ్‌తో పాటు మ‌రో రెండు దెయ్యాలు కూడా అదే ఇంట్లో ఉంటున్నాయి. మ‌రి ఈ మూడు దెయ్యాల క‌థేంటి? ఆత్మ జెన్నీని ఎందుకు ఆవ‌హించింది? ఆత్మ బారీ నుంచి జెన్నీని ఎలా కాపాడుకున్నారు అనేదే మిగతా క‌థ‌.

 

 విశ్లేష‌ణ‌:

‘గృహం’ క‌థ కూడా రొటీన్ హారర్ సినిమాల్లాంటిదే. అయితే కామెడీ ఎప్పుడైతే పక్కకుపెట్టి, సీరియస్ అంశాన్ని సీరియస్‌గానే చెప్ప‌డం మొద‌లెట్టారో, అప్పుడే భ‌యం క‌నిపించ‌డం మొద‌లైంది. సిద్దార్థ్-ఆండ్రియా మ‌ధ్య బెడ్ రూమ్ స‌న్నివేశాల‌తో, లిప్‌లాక్‌లతో సినిమా హాట్ హాట్‌గా మొద‌ల‌వుతుంది. జెన్నీ ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం ద‌గ్గ‌ర్నుంచి క‌థ‌లోకి భ‌యం అనే ఎలిమెంట్ ప్ర‌వేశిస్తుంది. ఇంట్ర‌వెల్ సీన్‌లో.. సిస‌లైన హార‌ర్ సినిమా చూపించాడు ద‌ర్శ‌కుడు. సౌండ్ ఎఫెక్ట్స్ , విజువ‌ల్స్‌ తో కావ‌ల్సినంత భ‌య‌పెట్టాడు. ఇక సెకండాఫ్‌లో దెయ్యాన్ని వ‌దిలిస్తే స‌రిపోతుంది అనుకొంటారంతా. అలా చేస్తే.. ‘గృహం’ కూడా మామూలు దెయ్యం క‌థ‌లానే మిగిలిపోదును. సెకండాఫ్‌లో ఓ ట్విస్ట్ వ‌స్తుంది. అది మాత్రం… షాక్ ఇచ్చేదే. అక్క‌డే ద‌ర్శ‌కుడు మొత్తం మార్కులు కొట్టేస్తాడు. అప్ప‌టి వ‌ర‌కూ సైడ్ క్యారెక్ట‌ర్‌లా అనిపించిన సిద్దూ.. ఆ ట్విస్ట్ త‌ర‌వాత రెచ్చిపోతాడు. ఇంట్ర‌వెల్ సీన్స్‌లో ఎంత భ‌య‌ప‌డ్డారో, ప‌తాక స‌న్నివేశాల్లో అంత‌కంటే ఎక్కువ భ‌యం క‌లిగించాడు. మొత్తానికి ఓ నిజ‌మైన హార‌ర్ అనుభూతి క‌లిగించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌లం అయ్యాడు. క‌థ రొటీనే అయినా, నేప‌థ్యం మార్చ‌డం, అందులో సిద్దూ లాంటి ల‌వ‌ర్ బోయ్‌ని ఎంచుకోవ‌డం, దానికి తోడు… ఒక‌టీ, రెండు దెయ్యాలు కాక‌… మూడు దెయ్యాల్ని క‌థ‌లో చొప్పించ‌డం… ఇలా పాత క‌థ‌కు కొత్త కోటింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం వ‌ర్క‌వుట్ అయ్యింది.

 

న‌టీన‌టులు:

లవర్ బోయి ఇమేజ్ సంపాదించుకున్న సిద్దార్థ్ ఈ సినిమాతో జోన‌ర్ మార్చి కొత్త తరహా పాత్రల్లో కూడా తన నటన ఎలావుంటుందో చూపి సత్తా చాటాడు. మొదట్లో ఎప్ప‌టిలా రొమాంటిక్‌గా క‌నిపించిన సిద్దూ, ప‌తాక స‌న్నివేశాల్లో విజృంభించాడు. జెన్నీ పాత్ర‌లో క‌నిపించిన న‌టి… సిద్దూతో పోటీ ప‌డి న‌టించింది. త‌న న‌ట‌న చాలా స‌హ‌జంగా క‌నిపించింది. దెయ్యం పాత్రలో మ‌రింత ర‌క్తి క‌ట్టింది. ఆండ్రియా, సురేష్‌, అతుల్ కుల‌క‌ర్ణి త‌మ త‌మ పాత్రల్లో రాణించారు. పాత్ర‌లు త‌క్కువ‌గా ఉండ‌డం, ప్ర‌తీ పాత్ర‌కూ ప్రాధాన్యం ఉండ‌డం, అంద‌రూ త‌మ త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టు రాణించ‌డంతో క‌థ ర‌క్తి క‌ట్టింది.

 

సాంకేతిక నిపుణులు :

విజువ‌ల్‌ పరంగా `గృహం` బాగుంది. టెక్నిక‌ల్ టీమ్ బాగా క‌ష్ట‌ప‌డింది. కెమెరాని రివ‌ర్స్ చేయ‌డం, వ‌స్తువుల‌న్ని త‌ల క్రిందులుగా చూపించ‌డం, అందులోంచి సిద్దార్థ్ న‌డుచుకొంటూ వెళ్ల‌డం… ఈ ట్రిక్కులు బాగా అనిపిస్తాయి. సౌండ్‌తో భ‌య‌పెట్ట‌డం, విజువ‌ల్‌గా భ‌య‌పెట్ట‌డం రెండు ర‌కాలు. ఇవి రెండూ గృహంలో క‌నిపించాయి. నేప‌థ్య సంగీతానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. డైలాగ్స్ కూడా అక్క‌డ‌క్క‌డ ఆక‌ట్టుకొన్నాయి.

 

చివరగా :  

భయపెట్టే రొమాంటిక్ హారర్ కామెడీ ‘గృహం’

Follow Us:
Download App:
  • android
  • ios