పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను హ్యాపీ చేసే వార్త ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. త్వరలో పవన్‌ `హరిహర వీరమల్లు` షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట.  

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) అభిమానులకు త్వరలో గుడ్‌ న్యూస్‌ రాబోతుంది. ఆయన త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం పవన్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` (HariHara VeeraMallu)చిత్ర షూటింగ్‌ రీ స్టార్ట్ కావడానికి టైమ్‌ ఫిక్స్ అయ్యిందట. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన యాభై శాతం షూటింగ్‌ పూర్తయ్యింది. పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటం, `భీమ్లా నాయక్‌` సినిమా షూటింగ్‌, విడుదల కారణంగా వాయిదా పడింది. 

దాదాపు ఐదారు నెలలు కావస్తున్నా ఇంకా ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభించలేదు. పవన్‌ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల వాయిదా పడుతూ వస్తోందని అన్నారు. అదే సమయంలో స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్టు, ఇంకా పక్కాగా, మరింత గ్రాండియర్‌గా దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. దర్శకుడు క్రిష్‌ ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. 

ఇక ఇప్పుడు అన్ని పూర్తి చేసుకుని సినిమా షూటింగ్‌ని మళ్లీ మొదలు పెట్టబోతున్నారట. అక్టోబర్‌ మూడో వారం నుంచి ఈ చిత్ర షూటింగ్ ని పునప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమా షూటింగ్‌లను బ్యాలెన్స్ చేస్తూ మిగిలిన సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో పవన్‌ ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రాన్నివిడుదల చేయబోతున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. 

మోఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. ఆ సమయంలో కోహినూర్‌ వజ్రాలు దొంగిలించే వీరమల్లు పాత్రలో పవన్‌ కనిపిస్తారని, పరోక్షంగా ఆయన వేల మంది పేదలకు సహాయం చేస్తారని సమాచారం. ఇప్పటికే `హరిహర వీరమల్లు`లో పవన్‌ లుక్ ఎలా ఉంటుందో తెలిసిందే. గ్లింప్స్ తో పవన్‌ లుక్‌ని చూపించారు. విడుదలైన గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మల్లయోధుడి లుక్‌లో ఆయన అదరగొట్టారు. సినిమాపై అంచనాలను పెంచారు. దీంతో సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

పవన్‌ చివరగా `భీమ్లా నాయక్‌`తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నెక్ట్స్ ఆయన హరీష్‌ శంకర్‌తో `భవదీయుడు భగత్‌ సింగ్`, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అలాగే `వినోదయ సీతం` చిత్రం రీమేక్‌లోనూ నటించాల్సి ఉంది. సాయిధరమ్‌ తేజ్‌ మరో హీరో. కానీ ఇది ఆగిపోయిందని సమాచారం.