తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రచయితల కొరత చాలానే ఉంది. కొరత అంటే మంచి కంటెంట్ అందించే వారు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. విజయేంద్ర ప్రసాద్ - పరుచూరి బ్రదర్స్ - కోన వెంకట్ - వక్కంతం వంశీ ఇలా కొంత మంది రైటర్స్ కి మంచి డిమాండ్ ఉంది. 

కథ, మాటలు , స్క్రీన్ ప్లే రైటర్స్ గా ఒక్కసారి క్లిక్ అయితే టాప్ డైరెక్టర్స్ వెతికి మరి పట్టుకుంటారు. ప్రస్తుతం మాటల రచయితగా సాయి మాధవ్ బుర్ర టాప్ లో కొనసాగుతున్నారని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో రచయితలను ఎక్కువగా వివి.వినాయక్ - శ్రీను వైట్ల వంటి వారు ఉపయోగించుకుంటారు. ఇక రాజమౌళికి తోడుగా తండ్రి పెన్ను ఎప్పుడూ ఉంటుంది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే..ఇప్పుడు ఇండస్ట్రీలో కథలు దొరకడం లేదు. స్టార్ డైరెక్టర్స్ ఎక్కువగా మంచి రచయితల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అవ్వాలంటే రైటర్ గా ముందు ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటే ఈజీగా డైరెక్షన్ ఛాన్స్ కొట్టేయవచ్చు. అందుకు ఉదాహరణగా త్రివిక్రమ్ ను చెప్పుకోవచ్చు.    

ఒక రచయితగా రెండు సినిమాలతో హిట్ అందుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. స్క్రిప్ట్ డిస్కర్షన్స్ లో అవకాశం ఈజీగా వస్తుంది. కథా చర్చల్లో కొన్ని సలహాలు ఇచ్చి కాస్త సమయాన్ని కేటాయిస్తే సిట్టింగ్ కు 25 వేల నుంచి 30 వేల న వరకు పేమెంట్స్ ను అందుకోవచ్చు. రైటర్స్ రేంజ్ బట్టి లక్షల్లో కూడా పేమెంట్స్ ఉంటాయి. 

ఇక కథలో భాగమైతే రెట్టింపు పేమెంట్ అందుతుంది. దిల్ రాజు నిర్మించే చాలా సినిమాలకు స్క్రిప్ట్ డిస్కర్షన్ తప్పకుండా ఉంటుందనేది ఇండస్ట్రీలో టాక్. బడా సినిమాలు చేసే దర్శకులు కూడా అనుభవం ఉన్న రచయితల ప్రమేయం లేనిది సినిమాను పట్టాలెక్కించరు. 

వినాయక్ - రాజమౌళి - శ్రీను వైట్ల వంటి దర్శకులు చాలా వరకు కథా చర్చలు జరపనిదే సినిమా మొదలు పెట్టరు. త్రివిక్రమ్ - పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మాత్రం రచనలో పెద్ద బలశిక్ష చదివారు కావున సొంత నిర్ణయాలతోనే సినిమాను తెరకెక్కిస్తారు. 

ఇప్పుడున్న ఒక ముగ్గురు నలుగురి రచనలకు మాత్రమే మంచి డిమాండ్ ఉంది. వారి పెన్ను విలువ కోట్లల్లో ఉంటుంది. కానీ రచయితల్లో ప్రస్తుతం వక్కంతం వంశీ లాంటి వారు దర్శకులుగా మారి వారి కథలను వారే తెరకెక్కించుకోవాలని డిసైడ్ అయ్యారు. 

కొరటాల శివ - అనిల్ రావిపూడి  వంటి వారు కూడా ముందుగా రచయితగా గుర్తింపు తెచ్చుకున్నవారే. ప్రస్తుతం ఇండస్ట్రీలో కథలు లేవనేది నిజమే. కొత్త కథలకు మంచి డిమాండ్ ఉంది, సో యువత మంచి కాన్సెప్ట్ తో ఈ టైమ్ లో పరిశ్రమలోకి వెళితే ఈజీగా అవకాశం కొట్టేయవచ్చు.