బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ఎదురైనా జిన్నా మూవీ టీం మాత్రం సక్సెస్ మీట్స్ ఏర్పాటు చేస్తుంది. ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేస్తున్న కలెక్షన్స్ ఫిగర్స్ చూసిన నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.  

మంచు విష్ణుకి మరోసారి నిరాశ తప్పలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన జిన్నా సైతం డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. మూకుమ్మడిగా ప్రేక్షకులు జిన్నా చిత్రాన్ని అవైడ్ చేశారు. ఆ మూవీ ఆడుతున్న థియేటర్స్ వైపు కన్నెత్తి చూడలేదు. హైదరాబాద్ నగరంలో మొదటి రోజు అమ్ముడైన టికెట్స్ 500 దాటలేదు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. యూఎస్ లో కేవలం 150 టికెట్స్ అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. 

దీపావళి కూడా కలిసి రాగా సోమవారం వరకు వీకెండ్ పొడిగింపబడింది. అయినా జిన్నా సినిమాకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదు. నాలుగు రోజులకు జిన్నా వరల్డ్ వైడ్ రూ. 70 నుండి 75 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక షేర్ సుమారు రూ. 40 లక్షల వరకూ రాబట్టింది. ఈ క్రమంలో జిన్నా మూవీ ప్రమోషన్స్ కి ఖర్చుపెట్టిన మొత్తం కూడా రాలేదు అంటున్నారు. సినిమా బడ్జెట్ రికవరీ పక్కన పెడితే థియేటర్స్ రెంట్ కూడా రావడం లేదు. 

జిన్నా పరిస్థితి ఇంత దారుణంగా ఉండగా... సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన సన్నీ లియోన్ కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. జిన్నా సినిమా వసూళ్లు ఆమె రెమ్యూనరేషన్ లో యాభై శాతం కూడా లేవని ఎద్దేవా చేస్తున్నారు. జిన్నా చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకుడు. పాయల్ రాజ్ పుత్ మరో హీరోయిన్ గా నటించారు. 

అదే సమయంలో ఏపీ/తెలంగాణాలలో కాంతార సెకండ్ వీకెండ్ రూ. 9 కోట్లు, సర్దార్ రూ. 7.5 కోట్లు, ఓరి దేవుడా రూ. 5.5 కోట్లు, ప్రిన్స్ రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. ఆ లెక్కన జిన్నా ఎక్కడ ఉందో అంచనా వేయవచ్చు. విశ్వక్ సేన్ తోపాటు డబ్బింగ్ చిత్రాల కంటే దారుణమైన కలెక్షన్స్ జిన్నా సినిమాకు వచ్చాయి.