నటి జెనీలియా డిసౌజా దక్షిణాదిన సినీ కెరీర్ ప్రారంభించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అరుదైన నటీమణుల్లో ఒకరు.తనకి సౌత్ చిత్రాల వల్లే గుర్తింపు వచ్చింది అని జెనీలియా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
సౌత్ లో జెనీలియా క్రేజ్
హీరోయిన్ జెనీలియా గురించి పరిచయం అవసరం లేదు. బొమ్మరిల్లు, సై, ఢీ లాంటి చిత్రాలతో ఆమె తెలుగు చిత్రాల్లో ఓ వెలుగు వెలిగారు. చలాకీ నటనతో యువతలో, ఫ్యామిలీ ఆడియన్స్ లో జెనీలియా గుర్తింపు సొంతం చేసుకుంది.
నటి జెనీలియా తన కెరీర్‌లో దక్షిణాది సినిమాల్లో తాను పోషించిన పాత్రల పట్ల గర్వంగా ఉన్నానని, తాను జీవితాంతం సౌత్ ఇండస్ట్రీకి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తాజాగా ఆమె నటించిన హిందీ చిత్రం సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సౌత్ సినిమాని అవమానించేలా యాంకర్ ప్రశ్న
ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను అడిగిన ప్రశ్నలో, “సౌత్ చిత్రాల్లో హీరోయిన్లకు బలమైన పాత్రలు ఇవ్వరు కదా” అని ప్రశ్నించగా, జెనీలియా తనదైన శైలిలో అతడికి ఇచ్చిపడేసింది. ఈ ప్రశ్నలో దక్షిణాది పరిశ్రమను తక్కువ చేసి చూపాలన్న ఉద్దేశం అతడిలో ఉన్నట్లు అనిపించింది. అయితే, అతడికి కౌంటర్ ఇస్తూ జెనీలియా ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది.
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జెనీలియా
జెనీలియా అతడికి సమాధానం ఇస్తూ,“లేదు, నాకు సౌత్ లో చాలా అద్భుతమైన పాత్రలు దక్కాయి. దక్షణాది చిత్రాల వల్లే నేను నటిగా ఎదిగాను. సౌత్ సినీ ఇండస్ట్రీ నా లెర్నింగ్ గ్రౌండ్. నా జీవితాంతం సౌత్ ఇండస్ట్రీకి రుణపడి ఉంటాను,” అని చెప్పారు.
అంతేకాకుండా, ఆమె నటించిన తెలుగు చిత్రం బొమ్మరిల్లులో హాసిని పాత్ర, తమిళంలో సంతోష్ సుబ్రహ్మణ్యంలో హరిణి పాత్ర, మలయాళంలో ఉరుమిలో ఆయేషా పాత్రలను ప్రస్తావిస్తూ, “ఈ పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంటాయి. అటువంటి పాత్రలు లభించడం నా అదృష్టంగా భావిస్తాను” అని పేర్కొన్నారు.
రాజమౌళి, శంకర్ గురించి ఇలా..
జెనీలియా మాట్లాడుతూ, నటులు ఇతర భాషల్లో సినిమా చేయాలంటే గుర్తింపుకోసం కాదు, నటనపై ప్రేమతో చేయాలని సూచించారు. “మన పని మన కెరీర్ ద్వారా మాట్లాడుతుంది. నేను సౌత్ లో శంకర్ గారు, రాజమౌళి గారు వంటి ప్రముఖ దర్శకులతో కూడా పని చేశారు, అలాగే కొత్త దర్శకులతో కూడా వర్క్ చేశాను. ఆ ప్రయాణం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది,” అని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమ పట్ల ఆమెకు ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించాయి. జెనీలియా మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సౌత్ సినిమా గురించి జెనీలియా చెప్పిన మాటలు అభిమానుల హృదయాల్ని గెలుచుకుంటున్నాయి.
జెనీలియా తెలుగు చిత్రాలు
తెలుగులో జెనీలియా అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
సత్యం (2003):
హీరో సుమంత్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ద్వారా తెలుగులో మంచి ఆరంభం దక్కింది. జెనీలియాకు యూత్‌లో గుర్తింపు తెచ్చిన చిత్రమిది.
సై (2004):
జెనీలియా రాజమౌళి దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదే. రగ్బీ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటించారు.
నా అల్లుడు (2005):
జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈ చిత్రంలో జెనీలియా గ్లామరస్ గా కనిపించింది.
బొమ్మరిల్లు (2006):
దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జెనీలియా పోషించిన ‘హాసిని’ పాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. బొమ్మరిల్లు చిత్రం ఆమె సినీ జీవితానికే మైలురాయిగా నిలిచింది.
హ్యాపీ (2006):
అల్లు అర్జున్ సరసన నటించిన ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో జెనీలియా మెడికల్ స్టూడెంట్ గా నటించారు.
ఢీ (2007):
మంచు విష్ణుతో కలిసి జెనీలియా నటించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీనువైట్ల ఈ చిత్రానికి దర్శకుడు.
రెడీ (2008):
రామ్‌తో కలిసి నటించిన ఈ చిత్రం మాస్, ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జెనీలియా ఈ చిత్రంలో చలాకీగా కనిపిస్తూ రామ్ తో మంచి కెమిస్ట్రీ పండించింది.
ఆరెంజ్(2010):
రాంచరణ్, జెనీలియా కలిసి నటించిన ఈ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.


