నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌ తదితరులు
సంగీతం: గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్
నిర్మాత‌: బ‌న్నివాసు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: ప‌రుశురామ్‌

'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో యూత్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. తన నుండి కొత్త సినిమా వస్తుందంటే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విజయ్ నటించిన 'గీత గోవిందం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
విజయ్ గోవింద్(విజయ్ దేవరకొండ) హైదరాబాద్ లో ఓ కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తుంటాడు. ఒకరోజు గుడిలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తనే గీత(రష్మిక మందాన్న). విజయ్ తన చెల్లికి పెళ్లి కుదిరిందని సొంతూరు కాకినాడకి బయలుదేరతాడు. విజయ్ బస్ ఎక్కిన కొద్దిసేపటికి అదే బస్ ఎక్కుతుంది గీత. విజయ్ పక్కనే ఆమె కూడా కూర్చుంటుంది. గీతను మాటల్లో పెట్టాలని అనుకుంటాడు. కానీ ఆమె పెద్దగా రెస్పాండ్ అవ్వదు. ఒక చిన్న విషయంలో విజయ్ తనకు హెల్ప్ చేయడంతో నవ్వుతూ మాట్లాడుతుంది. తన స్నేహితుడు ఇచ్చిన సలహాతో గీతను ముద్దుపెట్టుకోవాలనుకుంటాడు విజయ్. కానీ తప్పు అని తెలిసి వెనక్కి తగ్గుతాడు. కానీ యాక్సిడెంటల్ గా ఆమెకు ముద్దు పెట్టేస్తాడు.

దీంతో సీరియస్ అయిన గీత నీ అంతు చూస్తా అంటూ తన అన్నయ్య(సుబ్బరాజు)కి ఫోన్ చేసి చెబుతుంది. బస్ దిగిన వెంటనే వాడిని చంపేయాలని కోపంతో ఉంటాడు గీత అన్నయ్య. విషయం సీరియస్ అవుతుందని బస్ లో నుండి దూకి పారిపోతాడు విజయ్. తెల్లారితే గీత అన్నయ్యతోనే విజయ్ చెల్లెలి నిశ్చితార్ధం. ఫంక్షన్ లో విజయ్ ని చూసి కోపంతో రగిలిపోతుంటుంది గీత. కానీ విజయ్ చేసిన తప్పు కారణంగా పెళ్లి క్యాన్సిల్ అవ్వడం ఇష్టం లేక తనతో మిస్ బిహేవ్ చేసింది విజయ్ అనే విషయాన్ని దాస్తుంది. కానీ గీత అన్నయ్య మాత్రం తన చెల్లెలిని బాధ పెట్టిన వాడిని చంపేయాలని తిరుగుతుంటాడు. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి..? విజయ్ సంగతి గీత తన అన్నయ్యకి చెబుతుందా..? ప్రేమించిన అమ్మాయి తనను తప్పుగా అర్ధం చేసుకుంటుందనే బాధను విజయ్ ఎలా భరించాడు..? చివరికి గీత గోవింద్ ల జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్, హీరోయిన్ తో రొమాన్స్, ఐటెం సాంగ్స్ కచ్చితంగా ఉండాలనే అపోహలను ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలు కొట్టిపారేశాయి. 'గీత గోవిందం' కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ సినిమాలో పెద్ద పెద్ద యాక్షన్స్ సీన్స్, భారీ ఛేజ్ లు, కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ ఏవీ ఉండవు. కానీ కచ్చితంగా రెండున్నర గంటల ఎంటర్టైన్మెంట్స్ మాత్రం దొరుకుతుంది.  ఒక చిన్న పాయింట్ ని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా చిత్రీకరించి హిట్ కొట్టేశాడు దర్శకుడు పరశురామ్. హీరో అమ్మాయిని చూడడం ఇష్టపడడం, ఆ తరువాత హీరోయిన్ కూడా లవ్ చేయడం ఇలాంటి రొటీన్ కథలతో చాలా సినిమాలొచ్చాయి. కానీ ఈ సినిమాలో చివరివరకు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. సినిమా మొత్తం కూడా గీత క్యారెక్టర్ విజయ్ క్యారెక్టర్ ని తిడుతూ చిర్రుబుర్రులాడుతూనే ఉంటుంది. అతడి మీద బ్యాడ్ ఒపీనియన్ తో పురుగుని చూసినట్లు చూస్తుంది. అలాంటి అమ్మాయి హీరోతో ఎలా ప్రేమలో పడుతుందనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. దానికి బలమైన సన్నివేశాలతో కాకుండా సింపుల్ గా చూపించాడు దర్శకుడు. ఆ పాయింట్ కూడా ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్, హీరో షాపింగ్ చేయడం ఆ ప్రాసెస్ లో హీరో మేడం మేడం అంటూ హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశాడు. కథలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేకపోయినా ఈ తరం ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ కి ఈ సినిమా విపరీతంగా కనెక్ట్ అయిపోతుంది. తను ప్రేమించిన అమ్మాయే పెళ్లి చేసుకుందామని వచ్చి అడిగితే.. హీరో కాదనే సన్నివేశాలను మరింత ఎమోషనల్ గా చిత్రీకరించి ఉండాల్సింది. పతాక సన్నివేశాలు సినిమాకు హైలైట్. సినిమా మొత్తం కూడా కామెడీతో నింపేశాడు డైరెక్టర్. హీరో టెన్షన్ తో చచ్చిపోతున్నా.. చూసే ప్రేక్షకుడికి మాత్రం నవ్వే వస్తుంది. హీరో, హీరోయిన్ పాత్రలను దర్శకుడు రాసుకున్న తీరుని మెచ్చుకొని తీరాల్సిందే. హీరోయిన్ డామినేషన్ కథే అయినప్పటికీ హీరోకి కూడా ప్రాముఖ్యతనిస్తూ పాత్రను రాసుకున్నారు.

'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత విజయ్ నుండి అలాంటి కథలే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దానికి భిన్నంగా గోవింద్ అనే అమాయకపు అబ్బాయి పాత్రను ఎన్నుకొని విజయ్ పెద్ద సాహసం చేశాడు. అయితే తన నటనాపటిమతో ప్రతిభ చాటుకున్నాడు. చూడగానే రిలేట్‌ చేసుకునేలా ఉన్న ఫీచర్స్‌, సహజత్వంతో కూడిన పర్‌ఫార్మెన్స్‌తో విజయ్‌ ఈ జోనర్‌ సినిమాలకి మోస్ట్‌ వాంటెడ్‌ అయిపోతాడు. రష్మిక అభినయం ఈ చిత్రానికి మరో ఎట్రాక్షన్‌. కష్టపడకుండా, సునాయాసంగా హావభావాలు పలికించి తన పాత్రని రక్తి కట్టించింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని చాలా మంది రిజక్ట్ చేశారు. కానీ ఇంత మంచి క్యారెక్టర్ ని ఎన్నుకొని రష్మిక మంచి హిట్ సినిమా కొట్టేసింది. సినిమా మొత్తం ఆమె కోపంగానే కనిపించినప్పటికీ మరింత అందంగా కనిపించింది. 'ఛలో' సినిమాలో నటించింది ఈ అమ్మాయేనా అనిపిస్తుంది. అంతగా వేరియేషన్ చూపించారు. తెరపై చాలా అందంగా కనిపించింది రష్మిక. ముఖ్యంగా విజయ్, రష్మికల జంట కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది.సుబ్బరాజు క్యారెక్టర్ బాగుంది. రాహుల్ రామకృష్ణ కామెడీ నవ్వులు పూయిస్తుంది. ప్రీక్లైమాక్స్ లో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

అను ఇమ్మాన్యుయేల్, నిత్యామీనన్ గెస్ట్ రోల్ లో కనిపించారు. నిత్యామీనన్ గెస్ట్ రోల్ అనడం కంటే కథలో ఓ పాత్ర అని చెప్పొచ్చు. పెద్దల పాత్రలకి ఎంచుకున్న వారంతా కూడా మంచి పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. సాంకేతిక వర్గం కూడా సూపర్బ్‌ అవుట్‌పుట్‌ ఇచ్చి దర్శకుడి పని సులువు చేసింది. సంగీతం వీనుల విందుగా ఉంటే, ఛాయాగ్రహణం కంటికింపుగా అనిపిస్తుంది. 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' పాట గుర్తుండిపోతుంది. ప్రతి పాట సందర్భానుసారంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. కొత్త ఆలోచనల్ని ప్రోత్సహించడంలోనే నిర్మాతల అభిరుచి తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు లేకపోవడం కూడా గీతగోవిందానికి బాగా కలిసొస్తుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది. 

రేటింగ్: 3.5/5