జనాల మీద సినిమా ప్రభావం ఉండడం కామన్. సినిమాలో హీరోలు చెప్పే డైలాగులు చెప్పడం, వారు చేసినట్లుగా డాన్స్ చేయడానికి ట్రై చేయడం వంటివి చేస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది సినిమాలో చూపిస్తున్నట్లుగా హత్యలు కూడా చేస్తుండడం షాక్ కి గురి చేస్తోంది.

మొన్నామధ్య పదో తరగతి విద్యార్ధి కిడ్నాప్ వెనుక ఓ సినిమా స్ఫూర్తి ఉందని హంతకుడు చెప్పడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా మరో ఉదంతం చోటు చేసుకుంది. కేరళలో అనంతు అనే వ్యక్తి అత్యంత దారుణమైన రీతిలో హత్య చేయబడ్డాడు.

ఈ తతంగాన్ని నిందితుడు వీడియో షూట్ చేయడం షాక్ కలిగించే అంశం. వివరాల్లోకి వెళితే.. అనంతు అనే వ్యక్తికి విష్ణురాజ్ తో గొడవలు ఉన్నాయి. ఇద్దరూ డ్రగ్ డీలర్స్. కొన్ని విషయాల్లో ఇద్దరికీ విబేధాలు రావడంతో తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో విష్ణురాజు.. అనంతుని చంపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కెజిఎఫ్ సినిమాలో కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు.

తన సోదరులతో కలిసి మొత్తం పదమూడు మందిని గ్యాంగ్ గా చేసుకొని అనంతుని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసి అది వీడియో తీశారు. అంతేకాదు.. కెజిఎఫ్ లోని రెండు, మూడు డైలాగులు గర్వంగా చెబుతూ వీడియోలో పొందుపరిచారు. పోలీసులు వీరందరినీ అరెస్ట్ చేశారు. ఈ హత్యకి 'కెజిఎఫ్' సినిమా టీమ్ కి సంబంధం లేనప్పటికీ.. హత్య చేయడానికి ఈ సినిమాను స్పూర్తిగా తీసుకోవడం బాధాకరం.