విలక్షణ నటుడు విక్రమ్ కి తమిళనాట ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదల అవుతుంటాయి. దర్శకుడు శంకర్ విక్రమ్ హీరోగా వంద కోట్ల బడ్జెట్ తో 'ఐ' సినిమాను రూపొందించారు. ఇప్పుడు మరో దర్శకుడు విక్రమ్ తో భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నాడు.

ఓ నిర్మాణ సంస్థ విక్రమ్ మీద ఏకంగా రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతోంది. ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో భారీ పౌరాణిక చిత్రం రూపొందనుంది. దానికి 'మహావీర్ కర్ణ' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. ముందుగా ఈ సినిమాను మలయాళ నటుడు పృధ్వీరాజ్ హీరోగా అరవై కోట్లలో తీయాలని అనుకున్నారు. కానీ విక్రమ్ చేతికి ప్రాజెక్ట్ రావడంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది.

యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ అనే అమెరికా నిర్మాణ సంస్థ ఈ సినిమాను రూ.300 కోట్లతో నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు.

తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి  తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దాదాపు 32 భాషల్లో డబ్ చేసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు టెక్నీషియన్స్ గా ప్రముఖ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ త్రోన్స్ కి పని చేసిన వారిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. క్వాలిటీ పరంగా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించనున్నారు.