ఆగస్ట్ 30న ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఎఫెక్ట్ తో కొన్ని సినిమాల రిలీజ్ వాయిదా పడ్డాయి. 'సాహో' రిలీజ్ అయిన రెండు వారాల వరకు బాక్సాఫీస్ వద్ద మరో సినిమా వచ్చే ఛాన్స్ ఉండదు. అందుకే ఇప్పుడు క్యూ కట్టి మరీ కొన్ని చిన్న సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ కి పోటీ పడుతున్నాయి.

ఒకేరోజు మొత్తం పది సినిమాలు బాక్సాఫీస్ బరిలో తలపడనున్నాయి. అయితే వీటిలో ఒకట్రెండు సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదు. తమిళంలో సక్సెస్ అయిన సినిమాను 'కౌసల్యా కృష్ణమూర్తి' పేరుతో తెలుగులో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

అలానే 'ఏదైనా జరగొచ్చు' అనే చిన్న సినిమా తన  ప్రత్యేకత చాటుతోంది. కాస్తో కూస్తో ఈ రెండు సినిమాలపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. వీటితో పాటు బాయ్, ఉండిపోరాదే, నివాసి, హవా, నేనే కేడీ నెం 1, జిందా గ్యాంగ్‌, నీతోనే హాయ్‌ హాయ్‌, కనులు కనులు దోచేనే లాంటి సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.  

అయితే ఇవేవీ కూడా ఆడియన్స్ ని పెద్దగా ఎట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. సరైన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. ఈ డేట్ దాటిపోతే తమ సినిమాలను రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉండదని చిన్న సినిమాల నిర్మాతలు రిస్క్ చేసి గుంపుగా బాక్సాఫీస్ వద్ద తలపడడానికి సిద్ధమవుతున్నారు.