చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా అందరి మనసులను గెలుచుకుంది అవికా గోర్. ఆ బుల్లితెర క్రేజ్‌తోనే ‘ఉయ్యాల జంపాల’తో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కొన్ని వరుస అవకాశాలు వచ్చినా వదులుకుంది. తదుపరి ఆమె చేసిన సినిమా ‘సినిమా చూపిస్త మావ’. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి పేరు తెచ్చుకుంది.

 

అవిక అంతకుముందు నాగశౌర్య హీరోగా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూడు సినిమాల తర్వాత ఆమె జోరు బాగా తగ్గిపోయింది. కొంచెం లావైపోవడంతో యువ హీరోలు ఆమె వైపు చూడడం కూడా లేదు.

 

అయితే.. ఇప్పుడు మాత్రం ఆమె దశ తిరిగిపోయిందంటున్నారు టాలీవుడ్ జనాలు. ఎందుకంటే.. ఇటీవల విడుదలై విజయవంతంగా దూసుకుపోతున్న ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రానికి రూ.40 లక్షల పారితోషికాన్ని ఆమెకు ముట్టజెప్పారట. ఆమెది సినిమాలో లీడ్ రోల్ కూడా కాదు. ఓ ప్రత్యేక పాత్ర. ఆ పాత్ర షూటింగ్ కోసం ఆమె సర్దుబాటు చేసిన కాల్షీట్లు కేవలం 10 రోజులు. ఈ పది రోజులకే అవికకు అంత పారితోషికాన్ని ఇచ్చారట. అంటే రోజుకు ఆమెకు అందించిన మొత్తం రూ.4 లక్షలన్నమాట.

 

ఇక, సినిమాలోని ఇద్దరు హీరోయిన్ల కన్నా ఆమెకే ఎక్కువ మొత్తం ముట్టజెప్పారని టాక్. ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుందంటే ఆమె రేంజ్.. ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.