సోషల్ మీడియాలో ఫేక్ ఎక్కౌంట్స్ అనేవి సర్వ సామాన్యం అన్నట్లుగా మారాయి. సెలబ్రెటీలు కు అవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. వారి పేర్లుతో ఎక్కౌంట్స్ ఓపెన్ చేసి కొందరు తమ ఇష్టం వచ్చిన రాతలు రాసి, వారికి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యే ఫిష్ వెంకట్ కు ఎదురైంది. దాంతో ఆయన పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

గత కొద్ది రోజులుగా ఫిష్ వెంకట్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఎక్కౌంట్ నుంచి వైయస్ జగన్ పై దుష్ప్రచారం జరుగుతోంది.  అది ఫేక్ ఎక్కౌంట్ అని తెలియని చాలా మంది ఫిష్ వెంకట్ ని తిట్టిపోస్తున్నారు. దాంతో ఇది పెద్ద సమస్యగా మారేలా ఉందని ఆయన సైబర్ క్రైమ్ పోలీస్ లను ఆశ్రయించారు. అలాంటి ఎక్కౌంట్ ఓపెన్ చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...ఆన పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేయటానికి వెళ్లే సరికే ఆ ట్విట్టర్ ఎక్కౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు ఎలర్ట్ అయ్యారు. డిలేట్ చేసారు.  

ఈ నేపధ్యంలో ఫిష్ వెంకట్ ఓ వీడియో తో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ‘‘మా కుటుంబం మొత్తం వైఎస్ వీరాభిమానులం. మాది తెలంగాణ అయినప్పటికీ.. జగన్ సీఎం కావాలని చాలా ఏళ్లుగా కోరుకుంటున్నాం. మేం జగన్ కుటుంబీకులం. జగన్‌తో కలిసి నేను కూడా పాదయాత్రలో పాల్గొన్నాను. నేను చదువుకున్నది మూడో తరగతి వరకే. నా పేరిట సోషల్ మీడియా అకౌంట్లేవీ లేవు’’ అని ఆయన తెలిపారు.  దాంతో ఆయన్ను తిట్టిన వాళ్లు సారి చెప్తూ పోస్ట్ లు పెడుతున్నారు.